శ‌వానికి వైద్యం.. గుంటూరులో దారుణం!

Update: 2017-09-09 11:21 GMT

డ‌బ్బు గ‌డ్డి తినిపిస్తుంద‌ని ఓ సామెత‌. కానీ, గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రి యాజ‌మాన్యం.. డ‌బ్బు కోసం శవానికి వైద్యం చేసింది! చ‌నిపోయిన ఓ వ్య‌క్తికి డ‌బ్బు కోసం వైద్యం చేసి దారుణానికి ఒడిగ‌ట్టింది. దీంతో స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. వివ‌రాలు.. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో రాజ‌ధానికి కూత వేటు దూరంలోని ఓ  పైవేటు ఆసుపత్రిలో శ‌వానికి వైద్యం చేసిన దారుణం వెలుగు చూసింది.  రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన ఓ యువతి మృతి చెందినా.. ఆమెకు రెండు రోజుల పాటు వైద్యం చేసినట్లు నటించారు వైద్య శాల నిర్వాహ‌కులు.

ఫ‌క్తు.. ఈ ఘటన ఠాగూర్‌ సినిమాను గుర్తుకు తెచ్చింది. దీంతో స్థానికులు స‌హా బాధిత కుటుంబం తీవ్ర స్థాయిలో ఆస్ప‌త్రిడాక్ట‌ర్ల‌పై మండిప‌డుతోంది.  స్వరూప అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమెను హుటాహుటిన మంగళగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్ర‌మంలో వివిధ ప‌రీక్ష‌ల పేరుతో తొలుత బాధితురాలి కుటుంబం నుంచి రూ.1.50 లక్షలు ఆస్ప‌త్రి యాజ‌మాన్యం వ‌సూలు చేసింది. పోనీలే  డ‌బ్బు పోయినా త‌మ పిల్ల ప్రాణాల‌తో బ్ర‌తికితే చాల‌నుకున్న ఆ కుటుంబ స‌భ్యులు గుండెల్లో బాధ‌ను అణుచుకుని యువ‌తి  ప్ర‌మాదం నుంచి ఆరోగ్యంగా బ‌య‌ట‌ప‌డాల‌నే ఉద్దేశంతో వైద్యుల‌కు స‌హ‌క‌రించారు.

రెండు రోజులు గ‌డిచాయి. ఇంకో గంట‌లోనో ఇంకో పూట‌లోనో త‌మ కూతురును ప్రాణాల‌తో ఇంటికి తీసుకువెళ్లొచ్చ‌ని భావిస్తున్న ఆ కుటుంబానికి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం గుండెలు ప‌గిలే నిజాన్ని వెల్ల‌డించింది. స్వరూప చనిపోయిందని చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా బంధువులు కుప్ప‌కూలిపోయారు. ఇంత‌లోనే యాజ‌మాన్యం మ‌రో వార్త చెప్పింది. ఇంత వ‌ర‌కు అయిన వైద్యానికి మ‌రో ల‌క్ష పైచిలుకు క‌ట్టి.. శవాన్ని తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో నిర్గాంతపోయిన స్వరూప కుటుంబసభ్యులు ఆసుపత్రి తమను మోసం చేసిందని ఆరోపించారు. స్వరూప ముందే మరణించినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా వైద్య అవసరాలకు గుంజారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని గుండెల‌విసేలా రోదించారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రి రాజ‌ధానికి కూత వేటు దూరంలోనే ఇలాంటి దుర్మార్గ‌పు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటే ప్ర‌భుత్వ ప‌రువు ఏంకాను?! వైద్యుల ధ‌న దాహానికి అంతు లేదా?
Tags:    

Similar News