డోక్లాంపై చైనా మీడియా సూక్తి అదిరిందే!

Update: 2017-08-21 09:00 GMT
భార‌త్‌ను క‌వ్విస్తూ.. క‌య్యానికి కాలు  దువ్వుతున్నట్టు న‌టిస్తూనే దోబూచులాడుతున్న డ్రాగ‌న్ కంట్రీ చైనా.. ఈ విష‌యంలో తాను చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు భార‌త్‌పై బెడ్డ‌లు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే భార‌త్‌ పై చిందులు తొక్కేందుకు ముందుండే చైనా  మీడియాను విప‌రీతంగా వాడేస్తోంది. డోక్లాంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు భారీ ఎత్తున వ్య‌తిరేక‌ క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన చైనా అధికారిక మీడియా `జిన్హువా`... ప్ర‌పంచ దేశాలు చైనానే త‌ప్పుప‌డుతున్న నేప‌థ్యంలో.. ఇప్పుడు మాట మార్చి స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. తాజాగా విడుద‌ల చేసిన ఓ వీడియోలో చైనా భాష‌లోని అంద‌మైన మాట‌ల్ని గుదిగుచ్చి.. భార‌త్‌ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఈ వీడియోలో జాతి వివక్ష వ్యాఖ్యలు లేకపోయినా..  వ్యంగ్యం మాత్రం కుమ్మ‌రించింది. ఇక‌, అదే స‌మ‌యంలో భారత్‌ పట్ల కొంత సామరస్య వైఖరిని ప్రదర్శించే యత్నం కనిపించింది. భారత్‌ ప్రపంచంలోనే పురాతన నాగరికత గల దేశమని - అద్భుతమైన సంస్కృతి భారత్‌ సొంతమని వ్యాఖ్యానిస్తూనే.. రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లాం ప్రతిష్టంభనకు  కార‌ణం భారతేన‌ని చివ‌ర్లో విషం చిమ్మింది. నిజానికి డోక్లాం ఉదంతం వెలుగులోకి వ‌చ్చేనాటికే ఈ మీడియా సంస్థ భార‌త్‌పై అనేక క‌థ‌నాల‌ను సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌రుస వీడియోల‌తో భార‌త్‌ ను ప్ర‌పంచ‌స్థాయిలో భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని ఈ సంస్థ నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆ వార్త‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల '7 సిన్స్‌ ఆఫ్‌ ఇండియా' (భారత్‌ ఏడు పాపాలు) పేరిట ప్రసారం చేసిన వీడియోలో జాతి వివక్ష  వ్యాఖ్యలు, వ్యంగ్యం క‌ల‌గ‌లిపి కుమ్మేసింది. అయితే, భార‌త్ గురించి తెలిసిన అన్ని దేశాలూ జిన్హువాను ఏకిపారేశాయి. దీంతో ఈ చానెల్ నిట్ట‌నిలువుగా అభాసుపాలైంది. ఆ వీడియోలో భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. చైనా యాంకర్‌ సిక్కు మతస్తుడి మాదిరిగా గడ్డం అంటించుకొని భారతీయులను అనుకరించే ప్రయత్నం చేయడం  మరింత ఆగ్ర‌హానికి గురి చేసింది.

అంతేకాకుండా భారతే దౌర్జ‌న్యంగా దురాక్రమణ పూరితంగా చైనా భూభాగంలోకి ప్రవేశించిందని యాంక‌ర్లు గ‌ట్టి ప‌దాల‌తో వ్యాఖ్యానించేశారు. ఇక‌, ఇప్పుడు తాజా వీడియోల్లోనూ అవే వ్యాఖ్యలు, వైఖరి ప్రస్ఫుటం కావడం గమనార్హం. డోక్లాం చైనా భూభాగమని - భారతే తమ భూభాగంలోకి చొరబడిందని చెప్పుకొచ్చింది. చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ ఏ) ఏమాత్రం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడలేదని నొక్కి చెప్పుకొంది. అయితే, ఈ వీడియోలో భూటాన్‌ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. భారత్‌-భూటాన్‌-చైనా ట్రైజంక్షన్‌ లోని డోక్లాం ప్రాంతం భూటాన్‌ ది అని, అక్కడ చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం సరికాదని భారత్‌ - భూటాన్‌ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తాజా వీడియోతో మ‌రోసారి డ్రాగ‌న్ భార‌త్‌ పై నిప్పులు కురిపించింది.

Full View
Tags:    

Similar News