పెద్దన్నకు ఊహించని షాకిచ్చిన చైనా

Update: 2016-12-17 05:04 GMT
చక్కటి సంబంధాలు ఉండనప్పటికీ.. ఇంతకాలం ఎవరికి వారు వారి వారి పరిధిల్లో ఉంటూ.. లక్ష్మణ రేఖను దాటే యత్నం చేయలేదు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా రెండు అగ్ర రాజ్యాల నడుమ చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. ఈ పరిణామాలు చివరకు ఎక్కడి వరకూ వెళతాయన్నది ఇప్పుడు ఆందోళనల్ని రేకెత్తిస్తున్నాయి.

ఉప్పు.. నిప్పులా ఉండే అమెరికా.. చైనాల మధ్య అనుకోని పంచాయితీ ఒకటి చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తైవాన్ తో సంబంధాలు మెరుగు పర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు బయటకు పొక్కి ఇప్పటికే చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాకు షాకిచ్చే చర్యను చైనా చేపట్టింది.

దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన నేవీ డ్రోన్ ను చైనా యుద్ధ నౌక సీజ్ చేయటం ఇప్పుడు తీవ్ర ఉత్కంటకు గురి చేస్తోంది. డ్రాగన్ చర్యపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆస్తుల మీద చైనా చెయ్యి  వేసే హక్కు లేదని అమెరికా వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి అధిపత్యం తమదేనని చైనా వాదిస్తోంది.ఇలా రెండు బలమైన దేశాలు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది. తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్యనున్న సంబంధాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తానేం చేసినా నడిచిపోతుందన్న ధీమాతో ఉండే అమెరికాకు.. తమ విషయాల్లో ఎవరూ వేలు పెట్టకూడదన్నట్లుగా వ్యవహరించే చైనాకు మధ్య నడుస్తున్న తాజా పంచాయితీ ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News