కాక్ పిట్ లోనే కుట్ర.. చైనా ఘోర విమాన ప్రమాదం వెనుక

Update: 2022-05-18 06:30 GMT
ఈ ఏడాది మార్చి చివరిలో చైనాలో జరిగిన విమాన ప్రమాదం పెద్ద కలకలం రేపింది. మూడు దశాబ్దాల్లో చైనాలో ఎన్నడూ లేనంత పెద్ద ప్రమాదమిది. చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం (ఎంయూ5735) ఈ ఏడాది మార్చి 21న గుయాంగ్జీ పర్వతాల్లో కుప్పలకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.

అయితే, దీనివెనుక విమాన కాక్ పిట్ లోని వారే విమానాన్ని కూల్చేశారన్న వాదన వినిపిస్తోంది. బ్లాక్ బాక్స్ విశ్లేషణతో ఈ విషయం బయటకు వచ్చింది. విమాన ప్రమాదం తర్వాత అమెరికాకు చెందిన నిపుణులు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. తాజాగా వారి పరిశీలన ఫలితాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురిచింది. ఆ పత్రిక కథనం కాక్ పిట్ లోని వారే ( పైలట్లే ) ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని చెబుతోంది.

ఒక్కసారిగా 20 వేల అడుగుల కిందకు..కున్నింగ్ నగరం నుంచి బయల్దేరిన విమానం ప్రమాదానికి ముందు భూమికి 29,100 అడుగుల ఎత్తులో వెళ్తోంది. కొంతసేపటికే ఒక్కసారిగా 9 వేల అడుగులకు పడిపోయింది. ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ఏకంగా 3,225 అడుగులకు దిగింది. టెంగ్షియన్‌ కౌంటీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిపోగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఘోర దుర్ఘటనపై చైనా దర్యాప్తు చేపట్టింది.

దీనికి సహకారం అందించేందుకు బోయింగ్‌ ప్రతినిధులతో పాటు యూఎస్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) సభ్యులు చైనాకు వెళ్లారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో లభించిన బ్లాక్‌బాక్స్‌లను విశ్లేషించారు. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాక్‌పిట్‌ సెక్యూరిటీని ఉల్లంఘించినట్లు విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్‌ కూడా రాలేదని చైనా అధికారులు తెలిపారు. అంటే.. ఉగ్రదాడి, హైజాక్ వంటి అనుమానాలను కొట్టిపారేయొచ్చని అన్నారు.

మరి ఎందుకు చేశారబ్బా?విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ఆ విమానానికి సమీపంలో వెళ్తోన్న విమానాల పైలట్లు కూడా సమాచారం ఇచ్చేందుకు పదేపదే కాల్స్‌ చేశారు. కానీ, ఆ పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీన్ని బట్టి చూస్తే కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే ఉద్దేశపూర్వకంగా విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని బ్లాక్‌బాక్స్‌ డేటా ప్రకారం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. అయితే, విమాయ తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి గానీ, చైనా అధికారుల నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. విమానాన్ని నడిపిన పైలట్‌, కో పైలట్‌ విమానయానంలో ఎంతో అనుభవమున్న వారేనని, వారి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉందని చైనా ఈస్ట్రన్‌ చెబుతోంది. వారికి ఆర్థికపరమైన లేదా కుటుంబ సమస్యలు కూడా ఏం లేవని పేర్కొంది.
Tags:    

Similar News