జిన్ పింగ్ ప్రయాణించేందుకు చైనా నుంచి వచ్చిన కార్లు

Update: 2019-10-10 06:56 GMT
పేరుకు మిత్ర దేశంగా చెప్పినా.. రెండు దేశాల మధ్య తరచూ ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. మిత్రుడిగా ఉన్నప్పటికి దాయాదితో దగ్గరగా ఉంటూ.. భారత్ ను ఇబ్బంది పెట్టే డ్రాగన్ దేశం పైకి ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తుండటం తెలిసిందే. మరో రోజు వ్యవధిలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత దేశ పర్యటనకు వస్తున్నారు. అయితే.. ఈ ముఖ్యమైన విషయాన్ని ఆయన పర్యటనకు కేవలం యాభై గంటల ముందు మాత్రమే ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

మరో చిత్రమైన అంశం.. ఆయన పర్యటన తమిళనాడులోని మహాబలిపురంలోని ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరుగుతుండటం విశేషంగా చెప్పాలి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో ఇరు దేశాల అధినేతలు భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.

శుక్రవారం చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు బస చేసే హోటల్ వరకూ ప్రయాణాన్ని రోడ్డు మార్గంలో చేపట్టటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. జిన్ పింగ్ వాడే కార్లను చైనా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. 747 బోయింగ్ కార్గో విమానంలో నాలుగు బుల్లెట్ ఫ్రూప్ కార్లు తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ కు వచ్చాయి.

బ్లాక్ కలర్ లో ఉన్న ఈ నాలుగు కార్లు అత్యంత అధునాతనమైనవి.. భద్రమైనవిగా చెబుతున్నారు. బాంబు దాడుల్ని సైతం తట్టుకునేలా రూపొందించిన ఈ బుల్లెట్ ఫ్రూప్ కార్ల బరువు ఏకంగా 3152 కేజీలుగా చెబుతున్నారు. మొత్తం నాలుగుకార్లను చైనా నుంచి వచ్చాయి. ఒక్కో కారు 18 అడుగులు ఉండగా.. పొడవు 6.5 అడుగులు.. వెడల్లు ఐదు అడుగులు ఉండటం విశేషం.

ఇంజిన్ స్టార్ట్ అయిన ఎనిమిది సెకన్ల వ్యవధిలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లటం ఈ వాహనాల ప్రత్యేకత. చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నంతనే జిన్ పింగ్ తొలుత గిండిలోని ఫైవ్ స్టార్ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆయన ఈ కార్లలోనే మహాబలిపురానికి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండటం గమనార్హం.


Tags:    

Similar News