ముద్ర‌గ‌డ టీం బైక్ యాత్ర‌...బ్లాక్‌ మెయిల్

Update: 2017-06-23 05:34 GMT
ఏపీలో మ‌రోమారు కాపు ఉద్యమనేత - మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా మాట‌ల తూటాలు పేలుతున్నాయి. కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ ఈనెల 26న కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్ర‌గ‌డ‌ పాదయాత్రను చేపట్టిన సంగ‌తి తెలిసిందే. దీన్ని విజ‌య‌వంతం చేసేందుకు ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నిస్తుండ‌గా....కాపునే ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని హోంమంత్రి ఎన్‌.చినరాజప్ప విమర్శించారు. ఆయ‌న వెంట వెళితే కేసుల చిక్కులు త‌ప్ప‌వంటూ వ్యాఖ్యానించారు.

కిర్లంపూడి నుంచి అమరావతికి చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ కాపు యువత కాకినాడ సర్పవరం నుంచి కిర్లంపూడి వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. ముద్రగడకు కాపు యువత మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ కాపు యువత అంతా శాంతియుతంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న పాద‌యాత్ర ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్రారంభం అవుతుంద‌ని ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు.

కాగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై ఏపీ హోంమంత్రి, ఉప ముఖ్య‌మంత్రి చినరాజ‌ప్ప మండిప‌డ్డారు. పిఠాపురం బైపాస్‌ రోడ్డు మార్గంలో నూతనంగా నిర్మించిన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని ఆయన జిల్లా ఎస్‌పి రవిప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎటువంటి అనుమతులు లేకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ముద్రగడ ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చలో అమరావతి పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ సామాజిక తరగతిని ముద్రగడ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే శాంతిభ‌ద్ర‌త‌ల కోణంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ప్ర‌భుత్వానికి తెలుసున‌ని చిన‌రాజ‌ప్ప తెలిపారు. ఈ క్ర‌మంలో యువ‌త సంయ‌మ‌నం పాటించాల‌ని, అనవ‌స‌రంగా కేసుల పాలు కావ‌ద్ద‌ని హోంమంత్రి కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News