భారత్ కు పాకిస్థాన్ నుంచి నిత్యం ముప్పు పొంచి ఉన్నట్లే. అయితే నిత్యం స్నేహ హస్తం అందిస్తున్నట్లుగానే కనిపించే డ్రాగన్ కంట్రీ నుంచి కూడా ఇప్పుడు భారత్ కు పెను ముప్పే పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. సిక్కింలోని డోక్లాం వివాదాన్ని ఆసరా చేసుకుని భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ... ఇప్పుడు నేరుగా యుద్ధ సన్నాహాలు కూడా మొదలుపెట్టిందన్న వార్తలు కలకలం రేపేవే. ఇప్పటికే భారత్ కు కూతవేటు దూరంలోని టిబెట్ కు భారీ సైనిక పటాలాన్ని పంపిన చైనా... భారత్ పై యుద్ధం చేసేందుకే సిద్ధం అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత - ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పైకి దండెత్తి వచ్చేందుకు చైనా అన్నింటినీ సిద్ధం చేసుకుని సమయం కోసం కాసుక్కూర్చుని ఉందని ఆయన చెప్పారు. అంతేకాకుండా పాకిస్థాన్ ను ఆసరాగా చేసుకుని భారత్ కు తీరని నష్టాన్ని చేకూర్చేందుకు చైనా సన్నాహాలు పూర్తి చేసేసుకుందని ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నోరు విప్పిన ములాయం సింగ్... చైనా ఇప్పటికే పాకిస్తాన్ లో అణుబాంబును (న్యూక్లియర్) ఉంచిందని, భారత్ పైన దాడి చేసేందుకు సిద్ధమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారత్ కు పాకిస్థాన్ కంటే కూడా చైనా నుంచి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ను ఉపయోగించుకొని చైనా మన దేశం పైన కుట్రలు చేస్తోందని తెలిపారు. తనకు నాకు తెలిసిన సమాచారం మేరకు పాకిస్తాన్ లో చైనా న్యూక్లియర్ బాంబును ఉంచిందని, భారత్ పైన దాడి చేసేందుకు సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. భూటాన్, సిక్కింలను చైనా నుంచి కాపాడటం మన బాధ్యత అని ములాయం సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కంటే చైనానే మన పెద్ద శత్రువు అని ఆయన అభిప్రాయపడ్డారు.