అమెరికాపై చైనా ప్ర‌తీకార చ‌ర్య‌లు షురూ!

Update: 2022-08-06 12:30 GMT
త‌మ అభ్యంత‌రాలు, హెచ్చ‌రిక‌ల‌ను కాల‌ద‌న్ని అమెరికా దిగువ స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో ప‌ర్య‌టించ‌డాన్ని చైనా జీర్ణించుకోలేక‌పోతోంది. అమెరికాపై ప్రతీకార చ‌ర్య‌లు చేప‌ట్టింది. నాన్సీ పెలోసీ ప‌ర్య‌ట‌న ముగియ‌గానే ఇందుకు సంబంధించిన చ‌ర్య‌లకు దిగింది. ఇప్ప‌టికే తైవాన్ ను అష్ట‌దిగ్భంధ‌నం చేసిన చైనా.. తైవాన్ కు అన్ని విధాలా అండ‌దండ‌లుగా నిలుస్తున్న అమెరికాపై చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా అమెరికాతో వాతావరణ మార్పులు, రక్షణ విభాగం, మాదకద్రవ్య నిరోధక ప్రయత్నాల వంటి అంశాలపై చర్చలను నిలిపివేస్తున్నట్లు చైనా ప్ర‌క‌టించింది. అంతేకాకుండా సైనిక సమన్వయం, సముద్ర భద్రత, అక్రమ వలసదారుల అప్పగింతలో సహకారం, నేర పరిశోధనలు, అంతర్జాతీయ నేరాలు.. ఇలా అన్ని అంశాలపై అమెరికాతో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకొంటున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

అంతేకాకుండా త‌మ హెచ్చ‌రిక‌ల‌ను ధిక్క‌రించి తైవాన్‌ పర్యటనకు వచ్చిన నాన్సీ పెలోసీతోపాటు ఆమె కుటుంబం చైనా సందర్శించకుండా నిషేధం విధించింది. తమ సైనిక చర్యలను విమర్శిస్తూ ప్రకటనలు చేసిన జీ7 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల వైఖరిని చైనా ఖండించింది. ఇది త‌మ‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవ‌డంగా పేర్కొంది. అంతేకాకుండా ఆయా దేశాల వైఖ‌రిని నిరసిస్తూ చైనాలో ఉన్న‌ ఆయా దేశాల దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేస్తున్నట్టు వెల్ల‌డించింది.

కాగా చైనా తాజా ఆంక్ష‌ల‌పై అమెరికా మండిప‌డింది. చైనా అతిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తైవాన్ స‌మీపంలో చైనా సైనిక విన్యాసాలు బాధ్య‌తా రాహిత్య‌మ‌ని ఖండ‌న జారీ చేసింది.

మరోవైపు.. ఇంత‌టి వివాదానికి కార‌ణ‌మైన నాన్సీ పెలోసీ త‌న‌ జపాన్ ప‌ర్య‌ట‌న‌లో హాట్ కామెంట్స్ చేశారు. తైవాన్‌ ఏకాకి కాద‌న్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా యూఎస్‌ అధికారులను చైనా అడ్డుకోలేద‌ని ఈ మంట‌ను మ‌రింత పెంచారు.

అలాగే కంబోడియాలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సైతం చైనా చ‌ర్య‌ల‌ను ఖండించారు. తైవాన్ లో చైనా చేస్తోంది ఉద్దేశ‌పూర్వ‌క చొరబాటు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మిత్ర దేశాల రక్షణ విషయంలో తాము వెనక్కి తగ్గ‌బోమ‌న్నారు. చివరకు జపాన్‌ ప్రత్యేక ఆర్థికమండలి పరిధిలోనూ చైనా క్షిప‌ణులు ప్ర‌యోగించ‌డం క్ష‌మించ‌రాని నేర‌మ‌న్నారు.

కాగా కంబోడియా రాజ‌ధాని నాంఫెన్‌లో ఏషియన్‌ ప్రాంతీయ సదస్సులోనూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ క‌నీసం ప‌ల‌క‌రించుకోలేదు.
Tags:    

Similar News