వీర్యం కావలెను..క‌మ్యూనిస్టులు మాత్ర‌మే ఇవ్వాలి

Update: 2018-04-07 05:30 GMT
ఔను. అగ్ర‌రాజ్యంగా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్న చైనా దేశం విధించిన వింత ష‌ర‌తు ఇది. త‌మ అవ‌స‌రంలో కూడా ష‌ర‌తులు విధించిన చైనా ఇలా న‌వ్వులు తెప్పించే స్థాయికి చేరింది. ఒకవైపు వీర్యదాతలు కరువై పరిశోధకులు అవస్థలపాలవుతుండగా... చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విధేయత చూపి నాయకత్వానికి అండగా నిలిచే వారే వీర్యదాతలుగా ముందుకు రావాలంటూ బీజింగ్‌ కు చెందిన ఓ ప్రభుత్వ దవాఖాన షరతులు విధించింది. చైనా హార్వర్డ్ విశ్వవిద్యాలయంగా పిలుచుకునే ఓ ప్రముఖ ప్రభుత్వ దవాఖాన వీర్యదానంపై బుధవారం ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఎక్కడాలేని విధంగా షరతులు విధించడం పట్ల స్థానికులు ముక్కున వేలేసుకుంటుండగా... పరిశోధకులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.

20-45 ఏళ్ల‌ మధ్య ఉండే దాతలకు వీర్యనాణ్యత - వారి ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారికి ఒక్కొక్కరికి 5,500 యువాన్‌ లు (భారత కరెన్సీలో సుమారు రూ.58 వేలు) చెల్లిస్తారు. చైనాలో దేశవ్యాప్తంగా 23 స్పెర్మ్ బ్యాంకులు మాత్రమే ఉండగా, పలు వాటిల్లో వీర్యం సేకరణ నత్తనడకన సాగుతున్నదనే అపవాదు ఉంది. షాంఘై - గ్యాంగ్‌ జో నగరాల్లోని వీర్యం సేకరణ కేంద్రాల్లో మాత్రం ఎలాంటి షరతులు విధించలేదు. రెండు నెలల పాటు కొనసాగే ఈ వీర్యదాన ప్రచార కార్యక్రమాలతో సామాజిక మీడియాలో చురకలు అంటించే వారి మెదడుకు పని కల్పించినట్లయింది. షరతులపై లెక్కలేనంతగా కామెంట్స్ వస్తున్నాయి. అసలే వీర్యదాతలు దొరక్క సతమతమవుతుంటే ఇలా కండీషన్లు పెట్టడమేంటని పరిశోధకులు విసుక్కుంటున్నారు.
Tags:    

Similar News