వామ్మో.. ఇన్ని దేశాల్లో మీడియా సంస్థ‌ల‌ను చైనా లొంగ‌దీసుకుందా?

Update: 2022-09-13 05:46 GMT
చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న తీవ్రంగా జ‌రుగుతోంద‌న్న అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఐక్య‌రాజ్య‌స‌మితితో స‌హా దాదాపు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఈ విష‌యాన్ని అంగీక‌రించేవే. అలాగే చైనాలో మీడియా సంస్థ‌ల‌పై ఉక్కుపాదం కొన‌సాగుతోంది. చైనా అధికార పార్టీ, ప్ర‌భుత్వ ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ఏది చెబితే అదే నిజ‌మ‌నే దుస్థితి అక్క‌డ ఉంది. వార్తా సంస్థ‌ల‌పై చైనాలో క‌ఠిన నియంత్ర‌ణ‌లు అమ‌ల్లో ఉన్నాయి. ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ అనుకూల గ్లోబ‌ల్ టైమ్స్, జిన్హువా వార్తా సంస్థ‌లే చైనాలో అన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తుంటాయి.

ఇక సోష‌ల్ మీడియా ద్వారా చైనా ప్ర‌భుత్వ అరాచ‌కాలు ప్ర‌పంచానికి తెలుస్తాయ‌ని ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ త‌దిత‌రాల‌ను నియంత్ర‌ణ‌లు విధించింది. వుయ్ బో అనే ట్విట్ట‌ర్ ను పోలిన దాన్ని మాత్ర‌మే ప్ర‌జ‌లు వినియోగిస్తున్నారు. దానిలోనూ ఏది ప‌డితే అది పోస్టు చేయ‌డానికి కుద‌రదు.

ఇంత‌గా మీడియాను త‌మ దేశంలో నియంత్రించినా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, మైనారిటీల అణ‌చివేత‌, ముఖ్యంగా వీగ‌ర్ల‌పై అణ‌చివేత వంటివి ప్ర‌పంచం దృష్టికి వ‌స్తూనే ఉన్నాయి. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థ‌ల‌ను లొంగ‌దీసుకునే ప‌నుల‌కు చైనా శ్రీకారం చుట్టింది.

తనకు వ్యతిరేకంగా ఉండే మీడియాను లొంగదీసుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అమెరికాలోని థింక్‌ట్యాంక్‌ 'ఫ్రీడమ్‌ హౌస్‌' నివేదిక బాంబు పేల్చింది.  మీడియా సంస్థలను భయపెట్టి తనకు అనుకూలమైన కథనాలు ప్రచురించేలా చేసేందుకు జీ జిన్‌పింగ్‌ సర్కారు చర్యలను తీవ్రతరం చేసింద‌ని వెల్ల‌డించింది.

అమెరికాలోని ఫ్రీడమ్‌ హౌస్‌ నివేదిక ప్రకారం .. 2019 నుంచి ప్రధాన మీడియాలో చైనా అనుకూల క‌థ‌నాల‌ను భారీ ఎత్తున ప్రచారం చేయడం, చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, అభిప్రాయాలను ప్రచురించే సంస్థలను బెదిరించడం, సైబర్‌ వేధింపులకు పాల్పడటం, తప్పుడు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకురావడం వంటి పద్దతులను చైనా ప్ర‌భుత్వం అమలు చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే ముఖ్యంగా ఆఫ్రికాలోని 30 ప్రజాస్వామ్య దేశాల్లో 18 దేశాల్లో మీడియా సంస్థల‌ను చైనా లక్ష్యంగా చేసుకుంద‌ని తెలుస్తోంది. చైనా అధినేత జీ జిన్‌పింగ్ ప్ర‌తిష్ట‌ను పెంచేలా కథనాలు రాయాలని వీటిపై చైనా ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తోంద‌ని చెబుతున్నారు.

ఈ 18 ఆఫ్రికా దేశాల్లోని సోషల్‌ మీడియా, జర్నలిస్టులు, మీడియా సంస్థలు చైనాకు అనుకూల వాతావరణం ఉండేలా వార్తలు రాయాలని వారిపై చైనా ఒత్తిడి తెస్తోంది. మీడియాను ప్రభావితం చేసేందుకు భారీ ఎత్తున నిధులను కూడా కుమ్మ‌రిస్తోంది. ఇప్పటికే ఆ 18 ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల చైనా అనుకూల మీడియా చానల్స్‌ను ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. వాటిల్లో చైనా ప్రభుత్వ మీడియా కార్యక్రమాల ప్ర‌సారం కూడా మొద‌లు పెట్టేసింది.  మిగ‌తా దేశాల్లోని మీడియా సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టి వాటిని కూడా త‌న‌కు అనుకూలంగా లొంగ‌దీసుకోవాల‌ని అనుకుంటోంద‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News