ఇండియా...తేడా వస్తే నీకే కష్టాలు

Update: 2017-07-16 09:41 GMT
మనదేశానికి చైనా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. సరిహద్దులో ఓవైపు రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగుతూనే అక్క‌డి ప‌రిస్థితుల‌కు భార‌త్‌ను కార‌ణంగా చూపుతూ బ‌ద్‌నాం చేయాల‌ని చూస్తున్న చైనా తాజాగా బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది. స‌రిహ‌ద్దులోని డోక్లాం వ‌ద్ద  గ‌త నెల రోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పేర్కొన్న చైనా ఇందులో త‌న పాత్ర‌ను ప‌క్క‌న పెడుతూ భార‌త్‌దే అంతా త‌ప్పు అని ఆరోపించింది. ఈ మేర‌కు  తాజాగా అధికారిక వార్తా సంస్థ జిన్హుహాలో ఉద్దేశ‌పూర్వ‌క వార్త క‌థ‌నాన్ని వండి వార్చింది.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బ్రిక్స్ ఆధ్వర్యంలో బీజింగ్‌లో జరగనున్న బహుపాక్షిక భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు ఈనెల 27, 28 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్న స‌మ‌యంలో జ‌రిగే చ‌ర్చ‌ల‌కు తాము దూరంగా ఉంటామ‌నే భావ‌న‌ను బ‌లంగా పంపేందుకు ఈ క‌థ‌నం ద్వారా చైనా ప్ర‌య‌త్నించింది. స‌రిహ‌ద్దులోని డోక్లాం నుంచి ఇండియన్ ఆర్మీని వెనక్కి పిలిపిస్తే తప్ప చర్చలు ఉండవనే విషయాన్ని చైనా ప‌రోక్షంగా చెప్పింది. 2013, 2014లలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ అప్పుడు దౌత్య చర్చల వల్ల ఫలితం వచ్చిందని, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అధికారిక వ్యాసంలో తెలిపింది. ఈ రూపంలో త‌మ‌ను భార‌త్ తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చరించింది.  త‌ద్వారా డోక్లాం నుంచి త‌మ సిబ్బంది వైదొల‌గ‌రు కానీ భారత సైన్య‌మే వెన‌క్కుత‌గ్గాల‌ని సూచించింది.

అయితే ప్రస్తుత పరిస్థితిని భారత్ సైత నిశితంగా ప‌రిశీలిస్తోంది. చైనా హెచ్చ‌రిక‌లకు ఆవేశంగా స్పందించ‌కుండా ఆచితూచి అడుగులు వేయాల‌ని చూస్తోందని ఓ నిపుణుడు తెలిపారు.  ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టేందుకు అజిత్ దోవల్ చైనా ప‌ర్య‌ట‌న‌ను భార‌త్‌ ఉప‌యోగించుకునే చాన్స్ ఉంద‌ని అంచనా వేశారు. రెండు దేశాల సైనికులు వెన‌క్కిత‌గ్గితేనే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే భావ‌న‌ను అజిత్ బ‌లంగా వినిపిస్తార‌ని ఆయ‌న విశ్లేషించారు. అయితే రాబోయే శీతాకాలం వ‌ర‌కు ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చున‌ని అన్నారు. సైన్యం అక్క‌డి నుంచి వైదొల‌గిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో ఖ‌చ్చిత‌మైన మార్పులు ఉంటాయ‌ని ఆయ‌న ధీమాగా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా..సోష‌ల్ మీడియాలో ఇరు దేశాల‌కు మ‌ద్ద‌తుగా సాగుతున్న ప్రచారంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్రిక్తత‌లు పెరిగేందుకు ఈ పోస్ట్‌లు కార‌ణంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News