మోడీని మొనగాడంటున్న ‘చైనా’

Update: 2016-11-14 09:37 GMT
పక్కలో భల్లెం లాంటి చైనా ప్రధాని మోడీని అంతలా పొగిడేసిందా? అన్న సందేహం అక్కర్లేదు. నేరుగా చైనా పొగడకున్నా.. ఆ దేశ ప్రభుత్వానికి మీడియా రూపమైన గ్లోబల్ టైమ్స్ దాదాపుగా ఇలాంటి భాషనే మోడీ వ్యవహరంలో ఉపయోగించిందని చెప్పాలి. ఇక్కడ గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ గురించి చెప్పాలి. చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థగా దీన్ని చెప్పాలి. చైనా విధానాలు.. చైనా సర్కారు స్పందనలకు నిలువుటద్దంలా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యల్ని చెప్పుకోవచ్చు.

తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై గ్లోబల్ టైమ్స్ స్పందించింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ‘సాహసోపేతమైన చర్య’గా అభివర్ణించింది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించిన సదరుమీడియా సంస్థ పెద్దనోట్ల రద్దుతోనే నల్లధనాన్ని నియంత్రించలేమని వ్యాఖ్యానించింది.

డబ్బుతోనే కాక.. బంగారం.. రియల్ ఎస్టేట్.. విదేశీ ఆస్తులతో కూడా చీకటిఒప్పందాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్న గ్లోబల్ టైమ్స్.. వ్యవస్థల్ని సంస్కరించే ప్రయత్నం కూడా మోడీ చేయాలని పేర్కొంది. వ్యవస్థల్ని ఎలా సంస్కరించాలన్న అంశంపై సలహాలు.. సూచనల కోసం బీజింగ్ వైపు (చైనా వైపు) చూడాల్సిన అవసరం ఉందన్న గ్లోబల్ టైమ్స్.. ఈ తరహా చర్యల్ని ప్రస్తుతం చైనా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పింది.

అక్రమంగా జరుగుతున్న వ్యాపారమంతా డబ్బుతోనే ఎక్కువగా జరుగుతుందని.. అవినీతిపై మోడీ పోరు మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుపై మోడీ సర్కారు తిరుగులేని నిర్ణయాన్ని తీసుకుందని చెప్పటమే కాదు.. మోడీ సర్కారు పనితీరుపైనా ప్రశంసలు కురిపించటం గమనార్హం. గ్లోబల్ టైమ్స్ తాజా వ్యాఖ్యలు చూస్తే.. భారత్ లో మోడీ శక్తివంతమైన నేతగా అవిర్భవించటమే కాదు.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి సైతం వెనుకాడకపోవటాన్ని గుర్తించినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News