ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు

Update: 2021-05-30 15:30 GMT
రెండు రాస్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఆనందయ్య మందుపై తాజాగా చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుపై ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు.. పలువురు ఆనందయ్య మందుకు మద్దతుగా నిలుస్తున్నారు.

నిపుణుల్లో కొందరు ఆనందయ్య మందును సమర్థిస్తుంటే.. వైద్య వర్గాలకు చెందిన వారు మాత్రం విబేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కెమికల్ ఇంజనీరింగ్ మీద పట్టు ఉన్న వారు..ఆయన వినియోగించే దినుసులు.. సాంకేతికంగా వాటికుండే రసాయనాలను విశ్లేషించి.. ఒకట్రెండు వస్తువులు మినహా మిగిలిన వాటితో ఎలాంటి నష్టం ఉండదని తేలుస్తున్న పరిస్థితి.

తాము నియమించిన అధికారుల టీం ఇచ్చే నివేదిక ఆధారంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటివేళ.. చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకునేలా ఉండటం గమనార్హం. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్న చినజీయర్.. ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుంటూ సూటిప్రశ్నను సంధించారు.

సంక్షోభం వేళ.. ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదన్నఆయన.. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి మరణిస్తుంటే.. ఆ వ్యక్తికి ఆనందయ్య మందు వాడటం ద్వారా ప్రాణాలు నిలుస్తున్నప్పుడు వివాదం ఎందుకు అవుతుందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థలో మంచి ఎక్కడున్నా తీసుకోవాలన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News