ముద్రగడ ఉద్యమానికి ఎవరి సీరియస్ నెస్ ఎంత?

Update: 2016-12-19 04:11 GMT
కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం ఉద్యమ బాట చేపట్టిన సంగతి తెలిసిందే. బహిరంగ సభలు - నిరాహార దీక్షలు - అరెస్టులు - కేసులు ఇలా ఒకానొక దశలో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన కాపుల ఉద్యమం మ‌రోసారి మొదలైంది. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇచ్చిన పిలుపు మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాపులు "ఆక‌లి కేక‌లు" అనే పేరుతో మరోసారి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. గిన్నెలు - గరిటెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. చిన్నా పెద్దా అంతా కలిసి గరిటెలతో గిన్నెలపై శబ్ధాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఉద్యమంపై మరోసారి హోంమంత్రి చినరాజప్ప కూడా తనదైన రొటీన్ స్టైల్లో స్పందించారు!

ఉద్యమ స్థాయిని బట్టే ప్రభుత్వ పెద్దల స్పందన కూడా ఉంటుందో ఏమో కానీ... కాపు జేఏసీ ని రెచ్చ‌గొడుతూ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేస్తున్న కార్య‌క్ర‌మాల్లో చిత్త‌శుద్ధి లేద‌ని, నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంద‌ని చెప్పిన చినరాజప్ప - కాపుల‌కు మేలు చేసేది తెలుగుదేశం ప్ర‌భుత్వం మాత్ర‌మేన‌నీ చెప్పడంతో పాటు శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఏమాత్రం విఘాతం క‌లిగించినా ఉపేక్షించేది లేద‌ని హోం మంత్రిగా కూడా హెచ్చ‌రించారు. ఇలా సాగిన చినరాజప్ప స్పందన ఎంత రొటీన్ గా ఉందో - ఉద్యమ తీవ్రత కూడా అలానే ఉందనేది పలువురి అభిప్రాయంగా ఉంది!

కాపుల ఉద్య‌మానికి సంబంధించి మ‌లిద‌శ పోరాట కార్య‌క్ర‌మాలు వరుసగా ఉంటాయని గ‌త నెల‌లోనే ముద్ర‌గ‌డ పద్మనాభం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ముద్రగడ చెప్పినట్లు కాపుల ఉద్యమానికి సంబంధించిన కార్య‌క్ర‌మాల వ‌ల్ల ప్ర‌భుత్వంపై నిజంగానే ఒత్తిడి ఏమైనా పెరుగుతుందా? తొలుత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు కాపుల ఉద్యమం అన్నా, ముద్రగడ నిరాహార దీక్ష అన్నా సీరియస్ గా స్పందిస్తుందా? వంటి కొత్త అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే... ఉద్య‌మం ఏదైనా స‌రే ముందు చేసిన ఒక కార్య‌క్ర‌మానికి రెండోది కొన‌సాగింపుగా ఉండాలి. ప్రతిదశలోనో కొత్త అడుగు పడుతున్నప్పుడల్లా సమస్య తీవ్రత, ఉద్యమ తీవ్రత ప్రభుత్వంతో పాటు మిగిలిన జనాలకూ తెలియాలి. దానర్ధం జనజీవనాన్ని ఇబ్బందిపెట్టడమనే కాదు... వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం. అయితే ముద్ర‌గ‌డ ఉద్య‌మాల్లో మొద‌టి నుంచీ లోపిస్తున్న‌ది అదే అనే అభిప్రాయం పలువురు విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

దాంతో ప్ర‌భుత్వ వైఖ‌రిలో కూడా పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డం లేదు. దానికి తాజా ఉదాహరణే హోంమంత్రి చినరాజప్ప స్పందన. ముద్ర‌గ‌డ ఉద్య‌మించిన ప్ర‌తీసారీ హోం మంత్రి చినరాజ‌ప్ప లైన్లోకి వ‌చ్చేసి, విమ‌ర్శ‌లు చేసి వెళ్లిపోతారు. అంతకు మించి ఈ ఉద్యమం ఏ రకంగానూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకురావడం లేదనేవారే ఎక్కువ! కాపుల రిజ‌ర్వేష‌న్ల పేరుతో ముద్ర‌గ‌డ సాగిస్తున్న ఉద్య‌మం సరైందా కాదా అనే సంగతి కాసేపు పక్కన పెడితే... అసలు ఆ ప్రక్రియ ఉద్యమంగా సాగుతుందా.. అది సాగుతున్న తీరు ఏమైనా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తుందా.. ఈ ఆకలి కేకల ఉద్యమం ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే స్థాయికి వెళ్తుందా.. టీడీపీ హామీని గుర్తుచేసి సాధించుకునే పని జరుగుతుందా.. వేచి చూడాల్సిందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News