టీఆర్ ఎస్ గూటికి టీడీపీ కోస్తా ఎమ్మెల్యే

Update: 2016-01-30 07:41 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లుగా టీఆర్ ఎస్ దూకుడుగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు భిన్నంగా టీడీపీ ద్వారా ఎమ్మెల్యే ప‌ద‌విని అనుభ‌వించి, ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యే అయిన కోస్తా నాయ‌కుడు గులాబీ కండువా క‌ప్పుకొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టీఆర్ ఎస్ అధినేత‌ - సీఎం కేసీఆర్ త‌న‌యుడు కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టీఆర్‌ ఎస్‌ లో చేరారు. గ్రేట‌ర్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకున్నారు.

హైదరాబాద్‌ లో సీమాంధ్రులు ఏడాదిన్నరకాలంలో ఎంతో సురక్షితంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎవ‌రి ప‌ట్లా దురుద్దేశ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని రామ‌కోట‌య్య చెప్పారు. మంచి వాతావరణాన్ని కల్పించిన టీఆర్‌ ఎస్‌ ను బలపర్చాలని, గ్రేటర్‌ లో కారు గుర్తుకే ఓటు వేయాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. చిన్నం రామకోటయ్య ఎమ్మెల్యే గా ఉన్నప్పటినుంచి తనకు మంచి మిత్రుడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఉద్యమ సమయంలో నైతికంగా మద్దతు ఇచ్చిన ఆయన ప్రస్తుతం పార్టీని నేరుగా బలపర్చడానికి ముందుకురావడం సంతోషమని అన్నారు.

టీఆర్ ఎస్ పేరును తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చి రెండు రాష్ర్టాల‌కు విస్త‌రిస్తామ‌ని కేటీఆర్ ఇటీవ‌ల వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తాను బీమ‌వ‌రంలో పోటీ చేస్తాన‌ని కూడా కేటీఆర్ ప్ర‌తిపాదించారు. ఈ కామెంట్ గ్రేట‌ర్‌ లో ఓట్ల కోస‌మే అనుకున్న‌ప్ప‌టికీ తాజాగా సీమాంధ్ర‌లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉండే కోస్తాకు చెందిన ఎమ్మెల్యే గులాబీ గూటికి చేర‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు.
Tags:    

Similar News