సెల్వం స్కెచ్ స‌క్సెస్‌ ...అన్నాడీఎంకే నుంచి చిన్న‌మ్మ ఔట్‌

Update: 2017-04-18 17:41 GMT
త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్య‌మైన మ‌లుపు తిరిగాయి. అన్నాడీఎంకే ర‌థ‌సార‌థి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో పార్టీని కైవ‌సం చేసుకున్న శ‌శిక‌ళ‌కు ఘోర ప‌రాభావం ఎదురైంది. మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వేసిన స్కెచ్ ఫ‌లించి చిన్న‌మ్మ‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. అంతేకాదు ఈ నిర్ణ‌యానికి 122 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇచ్చారు. పార్టీ అంతా ఏక‌తాటిపైకి వ‌చ్చే చ‌ర్చ‌ల్లో భాగంగా సెల్వం స‌క్సెస్ సాధించారు.

అమ్మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంద‌రినీ ఏక‌తాటిపైకి తేవ‌డం అనే చ‌ర్చ‌ను రాజ్య‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై వేగంగా ముందుకు తీసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు ...అన్నా డీఎంకే పుర‌చ్చి త‌లైవి అమ్మ వ‌ర్గం నేత ప‌న్నీర్ సెల్వం... విలీనానికి ఓ షరతు విధించారు. శ‌శిక‌ళ పార్టీలోనే ఉంటే విలీనం ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆమె అక్క కుమారుడు దిన‌క‌ర‌న్ స‌హా కుటుంబ స‌భ్యులంద‌రినీ సాగ‌నంపాల‌ని ప‌న్నీర్ తేల్చి చెప్పారు. `ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకం. అందుకే శ‌శిక‌ళ కుటుంబాన్ని పార్టీ నుంచి సాగనంపే వ‌ర‌కు విశ్ర‌మించం. పార్టీ ఓ కుటుంబం చేతిలో ఉండ‌కూడ‌దు` అని ప‌న్నీర్ తేల్చిచెప్పారు.

ప‌న్నీర్ సెల్వం తేల్చిచెప్ప‌డంతో ఆయ‌న ష‌ర‌తుల‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. అనంత‌రం పార్టీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకొని శ‌శిక‌ళ‌ను సాగ‌నంప‌డమే ప‌రిష్కార‌మని నిర్ణ‌యించుకున్నారు. ఇదే విష‌యాన్ని మంత్రి జ‌య‌కుమార్ మీడియాకు వెళ్ల‌డించారు. మ‌న్నార్‌గుడి మాఫియాగా పేరున్న శశికళతో పాటు దినకరన్‌తో పాటుగా వారి కుటుంబ స‌భ్యుల‌కు మాఫియాకు పార్టీకి సంబంధం లేదని జ‌య‌కుమార్ ప్రకటించారు. అమ్మ ఆశ‌యాల మేర‌కు రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తామ‌ని జ‌య‌కుమార్ వివ‌రించారు.
Tags:    

Similar News