ఏపీసీసీ సారథి రేసులో ఆయనే.. జనవరి చివరికి ఖాయం

Update: 2021-12-30 00:30 GMT
తెలంగాణ పీసీసీకి రేవంత్ రెడ్డిని చీఫ్ గా చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఏపీలో పూర్తిగా కనుమరుగైన పార్టీకి జవసత్వాలు నింపేందుకు రెడీ అయ్యింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్థంగా నడిపించే నాయకుడి కోసం శూలశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రేసులో ఎవరు ముందున్నారన్న దానిపై ఆరాతీస్తోంది.

ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. అందరికంటే ముందు రేసులో మాజీ ఎంపీ డా. చింతామోహన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీ నివేదిక సిద్ధం చేయనున్నారు.

సమర్థుడు, విధేయుడు, సమన్వయంతో అందరినీ కలుపుకుని పోయే నాయకుడి కోసం అన్వేషణ సాగించింది హైకమాండ్. సంక్రాంతిలోపేఏపీ సీనియర్ నాయకులను స్వయంగా మరోసారి సంప్రదించనున్నారు ఉమన్ చాందీ. ముందుగా మాజీ సీఎం రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం ఏపీసీసీ చీఫ్ నియామకం.. పార్టీ బలోపేతంపై కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు.

విజయవాడ వెళ్లి మరోసారి ముఖ్యమైన రాష్ట్ర నేతలను కలిసి అంతిమంగా నివేదికను సిద్ధం చేయనున్నారు ఏఐసీసీ ఇన్ చార్జీల బృందం. సాధ్యమైనంత త్వరగా అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఏఐసీసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

జనవరి నెలాఖరుకల్లా ఏపీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం పూర్తి కావాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. పరిశీలనలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీ.డబ్ల్యూసీ) సభ్యులు.. కేంద్రమాజీ మంత్రి డా. చింతామోహన్ పేరు ఉంది. అంతేకాకుండా ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ హర్షకుమార్, ఏఐసీసీ సెక్రటరీ ముస్తాన్ వలీ పేర్లను కూడా పరిశీలిస్తోంది.
Tags:    

Similar News