ఇతర పార్టీలన్నీ గెలిస్తే.. రాహుల్ ప్రధాని!

Update: 2017-10-26 04:15 GMT
మామూలుగా నాయకులు ఎవరైనా సరే.. తమ పార్టీ గెలిస్తే తమకు గొప్ప పదవులు దక్కుతాయని కలలు కంటారు. తాము గద్దె ఎక్కి అధికారం చెలాయించవచ్చునని ఆశలు పెట్టుకుంటారు. తమ పార్టీని గెలిపించుకోవాలని తపన పడుతూ ఉంటారు. లేదా ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. అధికార పార్టీ మీద ప్రజల్లో ఎటూ ఏదో ఒకనాటికి వ్యతిరేకత వస్తుంది లే ఆటోమేటిగ్గా మన పార్టీకి పదవులు దక్కుతాయి అనే కోరిక కూడా కొందరికి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వారి వైఖరిని గమనిస్తోంటే.. ఈ రెండింటి కంటె భిన్నంగా ఉంది. ఆ పార్టీ మాజీ కేంద్రమంత్రి చెబుతున్న మాటల ప్రకారమే.. మూడో మార్గం లోంచి రాహుల్ పీఎం కావాలని అనుకుంటున్నట్లుగా అర్థమవుతోంది.

ఇదంతా కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెబుతున్న జోస్యం. 2019 ఎన్నికల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందిట. మోడీ మాజీ ప్రధాని అవుతారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా విజయం సాధిస్తుందని కూడా ఆయన అనడం లేదు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ బతికే ఉన్నదని అంటున్నారు గానీ.. ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేంత ఆదరణ ఉన్నదని అనలేకపోతున్నారు. అక్కడే ఆయన మాటల్లోని డొల్లతనం బయటపడిపోతున్నదనేది ప్రజల పరిశీలనగా ఉంది. ఎటూ  మోడీకి వ్యతిరేకంగా ప్రజలతా ఓట్లు వేస్తే.. ఎక్కడికక్కడ మోడీకి వ్యతిరేక పార్టీలన్నీ విజయం సాధిస్తాయి. వారందరికీ ఉమ్మడిగా నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు గాక ఉండదు. ఆ రకంగా అందరూ కలిసి తలా కొన్ని సీట్లు గెలుచుకుంటే.. ఏలుబడి సాగించడానికి కాంగ్రెస్ పార్టీ యువరాజు రంగంలోకి వస్తాడన్నమాట.! చింతా మాటలు మరీ అత్యాశలాగా  కనిపిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.

అయినా కాంగ్రెస్ కు సొంతంగా గెలిచే చేవ ఎప్పుడో చచ్చిపోయింది. 2002లోనే సంకీర్ణ ప్రభుత్వం కోసం కూటమి కావడం వల్ల పార్టీ అస్తిత్వమే చచ్చిపోయిందని.. ప్రణబ్ ముఖర్జీ వంటి పెద్దలు హెచ్చరిస్తోంటే.. మరోవైపు 2019లో కూడా సంకీర్ణం కోరుకుంటూ.. పార్టీ అస్తిత్వాన్ని మరింత ఘోరంగా మార్చడానికి చింతా లాంటి పెద్దలు కలగంటున్నారు. ఇలాంటి ప్రయోగాల ఫలితం... క్రమంగా కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి మెజారిటీ సీట్లు దక్కినా.. మరో పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ప్రధాని అయ్యే పరిస్థితి కూడా వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News