రేవంత్ ని కలసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..కారణం అదే!

Update: 2020-12-27 09:45 GMT
రేవంత్ రెడ్డి ..తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఆయన పేరే వినిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ ప్రస్తుతం టీ పీసీసీ రేసులో అందరికంటే ముందున్నారు. మొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో ఒక వెలుగు వెలిగారు. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన రేవంత్ ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.కాగా దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడి ఎంపికలో తలమునకలై ఉంది. పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ తో ఈ పోటీలో ఉన్నారు.
అయితే అధిష్టానం రేవంత్ కు పీసీసీ అప్పగించాలని భావిస్తుండగా పార్టీ సీనియర్లు మాత్రం ఇందుకు వ్యతిరేకిస్తున్నారు. వారు కోమటిరెడ్డికి అండగా నిలుస్తున్నారు.

రేవంత్ టీడీపీ నుంచి వచ్చాడని, అతడికి ఇంకా ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ రేవంత్ రెడ్డిని కలిసారు. మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. చింతమనేని పెద్ద కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహం జనవరి 2 వ తేదీన జరుగనుంది. ఈ వేడుకకు రావలసిందిగా చింతమనేని రేవంత్ కు ఆహ్వానం పలికారు.
Tags:    

Similar News