కోడిపందేలంటే. అంతా బగమంతుడి లీల!

Update: 2018-01-10 13:50 GMT
కోడి పందేలు నిర్వహించడానికి ససేమిరా వీల్లేదని ఈసారి కోర్టు కాస్త ఘాటుగా ఆదేశించడం - ఉల్లంఘన జరిగితే అధికార్లనే వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించడం ఒక సంచలనం. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉంది. నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ.. నియంత్రణకు ఎన్ని తీర్పులు ఉన్నప్పటికీ కోడిపందేలు జరిగే తీరుతాయన్నది సాధారణంగా జనం అనుకునే సంగతి. మాములుగా ఏ పార్టీ అధికారంలో ఉన్న సరే , కోర్టు అభ్యంతరాలను తుంగలో తొక్కి పందేలు జరిగేలా చూసేందుకు వక్రమార్గాలు వెతుకుతుంటారు. ఇప్పుడు తెదేపా నాయకులు కూడా అదే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మామూలుగానే వివాదాలకు -  ఆ తరహా వ్యాఖ్యలకు చింతమనేని పెట్టింది పేరు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఆరోపణల నిరూపణ - శిక్షల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. అధికార్ల మీద దాడులు చేయడం - దూకుడుగా వ్యవహరించడం వంటివి అనేకం ఆయన ట్రాక్ రికార్డులో కనిపిస్తాయి. అలాంటి చింతమనేని.. ఇప్పుడు కోడి పందేల గురించి ఓ మాట  అంటున్నారు.

కోడి పందేలను జనం నిర్వహించడం అంటూ ఏటీ ఉండదుట. కోళ్లే వాటికి జన్మతః అబ్బిన బుద్ధి కొద్దీ.. ఎదురుపడితే సాలు.. కొట్టేసుకుంటూ ఉంటాయిట. మరలాంటప్పుడు.. అయి కొట్టుకుంటా వుంటే.. చూడ్డానికి నలుగురు చుట్టూ చేరితే తప్పేటి అని ఎమ్మెల్యే గారు అంటన్నారు. మరి యిలాంటిదే యీ మద్దె కాలంలో ఇంటర్నెట్ లో ఒక జోకు కూడా చెలామణీ అయింది. ఎమ్మెల్యే గారు దాన్ని చూశారో లేదో మనకు తెల్దు గానీ.. ఆయన మాత్రం అచ్చంగా ఇదే భాష్యం చెప్తన్నారు.

అయితే ఎమ్మెల్యే గారి మాటల్ని విన్న జనానికి మాత్రం ఇంకో కొత్త డౌటు పుట్టుకొచ్చేత్తన్నాది. కోళ్లు ఒకదానికొకటి ఎదురపడంగానే.. ఎగబడి కొట్టేసుకుంటాయని అనుకుందాం. మరి ఆటి కాళ్లకి కత్తులు కట్టేదెవరు? కత్తుల్ని కూడా.. ఆ కోళ్లే కాళ్లకి కట్టుకుని మరీ బరిలో దిగుతాయా? పొలాన్ని సదునుజేసి.. గిరిగీసి బరిని సిద్దం జేసి పెట్టేదెవురు..? ఎక్కడో ఊరికి దూరంగా ఒక బరి, దానికి లైన్లు గట్రా గీసి ఉండే చోటనే రెండు కోళ్లు పరస్పరమూ ఎదురుపడి యాదృచ్ఛికంగా కొట్టీసుకోవడమూ.. అవి యెలిపోగానే.. మరో రెండు వచ్చి కొట్టీసుకోవడమూ.. అవి కూడా యెల్పోగానే యింకో రెండొచ్చి కొట్టేసుకోవడమూ.. యిదంగా బగమంతుడి లీల గాక మరేటి... ఎమ్మెల్యే గారే కరెష్టు కదా.. అని అనుకుంటున్నారు జనం.

Tags:    

Similar News