టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని హత్యకు కుట్ర!

Update: 2022-06-05 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు.. చింతమనేని. ఈ మేరకు ఆయన ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తనకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపబోతున్నారని.. ఈ మేరకు షూటర్లను కూడా నియమిస్తున్నారని తనకు చెప్పాడని చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులెవరో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చింతమనేని విన్నవించారు. గన్ మెన్ల జీతభత్యాలను భరించగల స్థితిలో తాను లేనని, కాబట్టి ఉచితంగా తనకు భద్రత కల్పించాలని కోరారు.

కాగా 2009, 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆయన వివాదాస్పదమయ్యారు. అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకు కొట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.

ఈ క్రమంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరిపై ఎన్నికల్లో ఓడిపోయారు.

నాటి నుంచి చింతమనేనిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఒకదాని వెంట ఒకటి కేసులు పెడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జైళ్ల చుట్టూ చింతమనేని ప్రభాకర్ ను తిప్పుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని చింతమనేని ఏలూరు కోర్టులో ఇటీవల ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సీఎం జగన్, మాజీ డీజీపీ గౌతం సవాంగ్, ఎస్పీ నవజోత్ సింగ్ గ్రేవల్, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

తనను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని.. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమైందని చింతమనేని తన పిటిషన్ లో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో మరణించేవాడినని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసులు వాదిస్తున్న న్యాయవాదికి ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది.
Tags:    

Similar News