ప‌వ‌న్ నీ అన్న‌ను విమ‌ర్శించేందు ర‌క్త సంబంధం అడ్డా?

Update: 2018-07-27 14:28 GMT
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ - జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ల  మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. దాదాపు మూడేళ్ల క్రితం ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి దిగిన  చింతమనేని ప్రభాకర్‌పై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగ‌తి తెలిసిందే. ఓ మహిళా అధికారిణిపై దాడి చేస్తే.. ఎమ్మెల్యేకు అండగా ఉంటారా అని ఏపీ సీఎం చంద్రబాబును జనసేన అధినేత సూటిగా ప్రశ్నించారు. ``ఏం ఆ ఎమ్మెల్యేకు కొమ్ములొచ్చాయా? సహనాన్ని చేతగానితనంగా భావించొద్దన్నారు. సర్దుకుపోవడం ఏంటి?`` అని అడిగారు. దీనిపై  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం ఘాటుగా స్పందించారు. తాను ఆమెపై దాడి చేయలేద‌ని పేర్కొంటూ అస‌లు త‌మ గెలుపున‌కు - ప‌వ‌న్‌ కు సంబంధం లేద‌న్నారు. ``ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ లేదా బీజేపీ మద్దతు ఇచ్చిందని గెలిచామా..? తన అన్ననే గెలిపించలేని వాడు మమ్మల్ని ఎలా గెలిపిస్తాడు”అని దాదాపు మూడేళ్ల కింద‌టే ప‌వ‌న్ గాలి తీసేలా  కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే.  

ఇదే రీతిలో తాజాగా మ‌రోమారు ప‌వ‌న్‌ పై చింత‌మ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీపై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో చింత‌మ‌నేని విరుచుకుప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఆరోపించారు. కాపు కుల‌స్తులు పీఆర్పీ త‌మ పార్టీ అని భావిస్తే...వారిని న‌ట్టేట ముంచార‌ని మండిప‌డ్డారు. ``మీ అన్న‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీని త‌మ పార్టీగా భావించి కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇచ్చారు. అయితే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా?`` అని చింత‌మ‌నేని ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు. పార్టీని న‌డిపించ‌లేక కాంగ్రెస్‌ లో విలీనం చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని ఎద్దేవా చేశారు. మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావని పవన్‌ ను చింతమనేని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా అని మండిపడ్డారు.

ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని ఈ సంద‌ర్భంగా రాబోయే ఎన్నిక‌ల్లో త‌న గెలుపు గురించి కూడా స్పందించారు. త‌న‌ను ఓడిస్తాన‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు. నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు’ అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  అన్న‌తో క‌లిసి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన పార్టీ ఎందుకు పెట్టార‌ని చింత‌మ‌నేని ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News