కాపుల కోసం రంగంలోకి దాస‌రి-చిరు

Update: 2016-09-07 08:52 GMT
కాపుల హ‌క్కుల కోసం ఏపీలో పోరు హీటెక్క‌నుంది. కొద్ది రోజుల క్రితం కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దీక్ష‌తో రాజుకున్న కాపుల పోరు తాత్కాలికంగా చ‌ల్లారినా నివురు గ‌ప్పిన నిప్పులా మారింది. ఈ నేప‌థ్యంలో కాపులు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఈ నెల 11న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో స‌మావేశ‌మ‌వుతున్నారు. కాపు జేఏసీ సైతం ఇక‌పై కాపుల కోసం పోరాటాలు ముమ్మ‌రం చేయ‌నుంది.

  మంగ‌ళ‌వారం శ్రీకాకుళంలోని జ‌రిగిన రాష్ట్ర కాపు జేఏసీ స‌మావేశంలో కాపు హ‌క్కుల సాధ‌న కోసం వీరు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మావేశానికి కాపు ప్ర‌ముఖ నేత‌లు మెగాస్టార్ చిరంజీవితో పాటు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, ప‌లువురు ఐఏఎస్ అధికారులు సైతం హాజ‌ర‌వుతార‌ని జేఏసీ నేత‌లు తెలిపారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మావేశంలో కాపుల బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

   ఇత‌ర రాష్ట్రాల్లో సైతం కాపుల‌ను బీసీలుగా గుర్తిస్తుంటే ఏపీలో మాత్రం ఓసీల్లోనే కొన‌సాగిస్తుండ‌డం స‌మంజ‌సం కాద‌ని వీరు ఫైర్ అవుతున్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలని కోరుతూ  70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న అంశాన్ని కూడా వీరు త‌మ ప్ర‌ధాన ఎజెండాలో చేర్చుకోనున్నారు. ఇక ముద్ర‌గ‌డ దీక్ష త‌ర్వాత ప్ర‌భుత్వం ఆగ‌స్టు వ‌ర‌కు గ‌డువు ఇచ్చినా ..గ‌డువు తీరినా హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో కాపు నాయ‌కులంతా బాబు స‌ర్కార్‌ ను టార్గెట్ చేసుకుని మ‌రో పోరాటానికి రెడీ అయ్యేలా ప్లాన్లు వేస్తున్నారు.

 ఇక రాజ‌మ‌హేంద్రవ‌రం స‌మావేశానికి కాపు ప్ర‌తినిధులుగా చిరు - దాస‌రి కూడా వ‌స్తుండ‌డంతో వీరు కాపు పోరాటంలో నేరుగా ఉద్య‌మించేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఏదేమైనా ప్ర‌స్తుతం మ‌రోసారి కాపులు ఉద్య‌మానికి రెడీ అవుతున్నారు. ఈ పోరులో గ‌తంలో కంటే భిన్నంగా కాపు దిగ్గ‌జాలు - ప్ర‌ముఖులు సైతం నేరుగా రంగంలోకి దిగుతుండ‌డంతో ఈ పోరు ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా మారింది.
Tags:    

Similar News