పొరుగు రాష్ట్రంలో చిరు వ‌ర్సెస్ ప‌వ‌న్‌

Update: 2018-02-01 07:59 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా....ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీజేపీ ముఖ్య‌నేత‌లు అమిత్ షా - యోగీ ఆదిథ్యనాథ్ పర్య‌టించారు. అయితే దీనికి కొన‌సాగింపుగా మ‌రో ఇద్ద‌రు తెలుగు ప్ర‌ముఖులు త‌మ స‌త్తాను చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ నేత‌ - మెగాస్టార్ చిరంజీవి - జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కర్ణాటకలోని బెంగళూరులోనే కాకుండా కోలారు - చిక్‌ బళ్లాపురం - రాయచూరు ప్రాంతాల్లో తెలుగువాళ్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లోని మ‌నోళ్ల ఓట్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్ - జేడీఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. 2013లో ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసు పార్టీ కోసం ప్రచారం చేశారు. అదే రీతిలో చిరు తాజాగా ప్ర‌చారం చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. క‌న్న‌డ సినీ న‌టుడు - మాజీ మంత్రి అంబ‌రీష్ ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. చిరంజీవిని తీసుకుని వచ్చి ప్రచారం చేయిస్తానని ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్యకు అంబ‌రీష్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవి చేత ప్రచారం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది.

మ‌రోవైపు జ‌న‌సేనాని జేడీఎస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తమకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్. డి. కుమార స్వామి మీడియాకు వెల్ల‌డించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక ఎన్నికల్లో త‌మ కోసం ప్రచారం చేయనుండ‌టంతో అక్క‌డి తెలుగువారి ఓట్లు త‌మ ఖాతాలో చేరుతాయ‌ని జేడీఎస్ పార్టీ విజయంపై న‌మ్మ‌కం పెట్టుకుంది. కాగా - తెలుగు సినీ రంగంలో - రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న చిరంజీవి - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రచారం చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.
Tags:    

Similar News