కేసీఆర్ సర్కారు నిర్ణయం వెంటనే..చిరు సంచలన నిర్ణయం

Update: 2020-03-15 04:40 GMT
కరోనా వైరస్ అన్నంతనే కంగారు పడటం.. ఆ వెంటనే భయపడటం సర్వత్రా చూస్తుంటాం. కానీ.. అందరూ మర్చిపోయేదేమంటే.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది కాదు. మందు లేనప్పటికీ.. దీని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ కరోనా సోకినా.. వెంటనే ప్రాణం పోదు. సరైన చికిత్స అందుబాటులో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీనంతటికి మించి.. కరోనా గురించి ఆగమాగం అయ్యే కన్నా.. వ్యక్తిగత శుభ్రత.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటే.. దీని బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువన్నది మర్చిపోకూడదు.

కరోనా మీద ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ.. రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు కావటం.. అనుమానితుల సంఖ్య పెరుగుతున్న వేళలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెలఖారు వరకు స్కూళ్లు.. సినిమా థియేటర్లు.. మాల్స్.. మల్టీఫ్లెక్సులు బంద్ చేయాలని ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజా సహకారం కూడా అవసరమంటూ ఆయన తన సినిమా షూటింగ్ లను తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.

కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించటం ఒక వ్యూహమైతే.. వైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలు ఎక్కువ జమ అయ్యే కార్యక్రమాల్ని వాయిదా వేయటం.. స్కూళ్లు.. మాల్స్.. థియేటర్లను మూసివేయటం లాంటి చర్యలు రెండో వ్యూహంగా అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వెల్ కం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని.. నమ్మకాన్ని పెంచేలా తీసుకుంటున్న చర్యల్ని తాను సమర్థిస్తానని చెప్పిన చిరు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఇలాంటి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన నెల్లూరులో స్కూళ్లు.. మాల్స్.. థియేటర్లు.. స్విమ్మింగ్ ఫూల్స్ మూసివేస్తే.. వైరస్ వ్యాప్తికి చర్యలు తీసుకున్నట్లు అవుతుందన్నారు. ఈ విధమైన చర్యల్ని ఏపీ ముఖ్యమంత్రి తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. సినిమా షూటింగ్స్ లో పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పని చేయాల్సి ఉంటుందని.. వారి ఆరోగ్యం గురించి ఆలోచించి తాను నటిస్తున్న సినిమా షూటింగ్ లను పది నుంచి పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

తన సినిమా షూట్ ను వాయిదా వేయాలని దర్శకుడు కొరటాల శివను కోరినప్పుడు వెంటనే ఆయన అంగీకరించారని.. ఆర్థికంగా కొంత ఇబ్బందే అయినా.. ఆరోగ్యానికి మించింది మరేమీ ఉండదన్నది మర్చిపోకూడదన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టే చర్యల్లో సినీ రంగం కూడా పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చిరు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. టాలీవుడ్ చిత్రాల షూటింగ్ లు ప్యాకప్ కావటం పక్కా అని చెప్పక తప్పదు.
Tags:    

Similar News