అలయ్ బలయ్ లో చిరు షాకింగ్ కామెంట్స్

Update: 2022-10-06 12:05 GMT
దసరా మరుసటి రోజు ప్రతి ఏటా క్రమం తప్పకుండా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బీజేపీ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయ లక్ష్మి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లతో పాటు మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. నిన్న సాయంత్రం చిరంజీవి ఇంటికి వెళ్లిన దత్తన్న..చిరును ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్‌ బలయ్‌ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి...కీలక వ్యాఖ్యలు చేశారు.తనను ఈ కార్యక్రమానికి పిలవడం సంతోషంగా ఉందని,17 ఏళ్లుగా దత్తాత్రేయ గారు, ఈ ఏడాది ఆయన తనయురాలు విజయలక్ష్మి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కులమతప్రాంతాలకు అతీతంగా ఆత్మీయంగా జరిగే కార్యక్రమం ఇదని ప్రశంసించారు.

ఈ అలయ్ బలయ్ లో పాల్గొనాలని చాలాకాలంగా కోరిక ఉందని, గతంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వచ్చాడని అన్నారు. ఈ ఏడాది అవకాశం దక్కిందని, దత్తాత్రేయ గారు ఆహ్వానించగానే కచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని డిసైడ్ అయ్యాయని చిరు అన్నారు. గాడ్ ఫాదర్ సక్సెస్ అయిన మరుసటి రోజునే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. 1980వ దశకంలో సినీ అభిమానం పేరుతో జరిగే కొన్ని పరిణామాలు తనకు నచ్చేవి కావని, వాల్ పోస్టర్లు చించడం వంటివి చేసేవారని గుర్తు చేసుకున్నారు.

ఆ కల్చర్ మార్చాలని తాను అనుకున్నానని, అందుకే తన సినిమా సక్సెస్ అయితే సాటి హీరోలు, సినీ ప్రముఖులను పిలిచి పార్టీ ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇదే రకంగా పార్టీలకతీతంగా తెలంగాణ సంస్కృతిని దత్తాత్రేయ కాపాడుతున్నారని అభినందించారు. ఇక, బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ నిర్వహిస్తున్న తనపై గతంలో రకరకాలుగా ఆరోపణలు చేశారని, తాను సంయమనం పాటించేవాడినని అన్నారు.

తన చిత్తశుద్ధిని తర్వాత అందరూ గుర్తించారని, తాను గతంలో ఆరోపణలను పట్టించుకోలేదని అన్నారు. ఎవరితో వైరం ఉన్నా..ఒక్క సారి ఇగో పక్కన పెట్టి దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటే అన్నీ మర్చిపోతారని చిరు అన్నారు. ఇక, పోతురాజు లతో కలిసి చిరంజీవి డప్పు వాయించి స్టెప్పులతో అలరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News