జనసేనలోకి అన్నయ్య?

Update: 2018-07-10 06:54 GMT
ఏపీలో టీడీపీతో కలవడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ ఆ పార్టీకి మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తన తమ్ముడి పార్టీ జనసేనలోకి అధికారికంగా చేరనున్నట్లు సమాచారం.ఈ మాట మెగా అభిమానుల నుంచే వినిపిస్తోంది. అంతేకాదు.. మెగా అభిమానుల అడుగులూ దీనికి ఊతమిస్తున్నాయి.
    
ఉమ్మడి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కొంతకాలం పాటు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేశాక గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి.. 2014 ఎన్నికల తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో ఏర్పాటైన జనసేనలోకి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారట.
    
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జనసేనలో చేరడం అందుకు సంకేతాలిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక - తమిళనాడు - మహారాష్ట్రలకు చెందిన మెగాస్టార్‌ అభిమానులు ఈ సందర్భంగా హైదరాబాద్‌ చేరుకున్నారు.
    
కాగా ఏపీ కాంగ్రెస్‌ లో అంటీముట్టనట్లుగా ఉంటున్న  చిరంజీవి ఆ పార్టీని వీడాలన్న నిర్ణయానికే వచ్చినట్టు తెలుస్తోంది. మెగా అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో జనసేనలో కలిసిన సందర్భంగా చిరంజీవికి అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ తన సోదరుడు చిరంజీవి మాటను జవదాటేది లేదని చెప్పారు. ప్రజా రాజ్యం పార్టీని అన్నయ్య చిరంజీవి స్థాపించినప్పటికీ అందులో పనిచేసిన నాయకులు జవాబుదారితనంతో లేకపోవడంవల్లే ఇబ్బందులు వచ్చాయని జనసేన పార్టీ అలా కాదని చెప్పారు. మొత్తంగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి జనసేనలో చేరి కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. చిరు అభిమానులు జనసేనలో చేరుతుండడం కూడా ఇందుకు సంకేతాలిస్తోంది. అభిమానుల ఒత్తిడిపై తమ్ముడితో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించి చిరు జనసేనలోకి వస్తారని భావిస్తున్నారు.
Tags:    

Similar News