చిరంజీవి భుజాల మీదుగా తుపాకి పెట్టి.....భారీ కుట్రేనట... ?

Update: 2022-01-15 00:30 GMT
సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గ్లామర్ అందరికీ తెలిసిందే. ఇక రాజకీయాల్లో ఏపీ సీఎం జగన్ కూడా దూకుడుగానే ఉంటారు. ఈ ఇద్దరు కలసిన మల్టీస్టారర్ సినిమాను తెలుగు జనాలకు సంక్రాంతి పండుగ శుభ వేళ  కనువిందుగా చూపించారు. ఎన్నో సినిమాలు తీసి  పండిపోయిన చిత్ర పరిశ్రమ వర్గాలు సైతం ఈ సినిమాను ఆసక్తిగా వీక్షించారు. ఎంతో ఆశతో కూడా వారున్నారు. అయితే ఇది బయటకు మాత్రమే  సినిమా తప్ప నిజానికి కానే కాదు, భారీ కుట్ర అని అంటున్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్.

ఇంతకీ ఆయనకు ఈ అనుమానాలు ఎలా వచ్చాయో ఆయన మాటాల్లోనే చూస్తే అర్ధమవుతుంది.  తెలుగు  సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడడానికి చిరంజీవిని జగన్ ఆహ్వానించారు. అయితే ఆయన ఒక్కరిని మాత్రమే అని షరతు పెడుతూ పిలిచారు. దాంతో మెగాస్టార్ ఒక్కరే జగన్ ఇంటికి వెళ్లారు. అక్కడ విందారగించారు. ఆయన అనేక సమస్యలను కూడా చర్చించి వచ్చారు. ఫలవంతంగా చర్చలు జరిగాయని చిరంజీవి మీడియా ముందు చెప్పుకున్నారు.

అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిశ్రమలను తీర్చడానికి వైసీపీ సర్కార్ సిద్ధంగా లేదన్నదే కూసంపూడి శ్రీనివాస్ అనుమానం. చిరంజీవిని ఒంటరిగా పిలవడం వెనక పెద్ద  కుట్ర ఉందని అంటున్నారు. ఆయన్ని సినీ పెద్దగా పిలిచి ఆయన నోటి మీదుగా ఏదో జరిగిపోతుందని చెప్పించి తీరా ఏమీ చేయకుండా ఆ నిందను ఆయన మీద వేసేలా చేస్తారు అని జరిగినది చూసి జరగబోయేది ఏంటో కూసంపూడి శ్రీనివాస్ చెప్పేశారు.

ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా చిరంజీవి కి జగన్ హామీ ఇచ్చారు కాబట్టి ఏదో జరిగిపోతుందని అనుకుంటారని, కానీ అది జరగదని, ఆ విధంగా సినీ పరిశ్రమ యావత్తుకు మెగాస్టార్ చెడ్డ అయ్యేలా  చేసే ప్లాన్ ఉందని కూడా అంటున్నారు. అంతే కాదు చిరంజీవి తన రాజ్యసభ సీటు కోసం చర్చించడానికి వచ్చారని లీకులు వదలడం కూడా ఈ కుట్రలో భాగమే అంటున్నారు. ఆ విధంగా అనుకూల మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారని కూడా ఆయన నిందించారు.

మరో వైపు మెగాస్టార్ ని ముందు పెట్టి తెలుసు చిత్ర పరిశ్రమకు ఏమీ చేయకుండా చేస్తున్నారని ఆయన డౌట్లు వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అనుమానాలు అన్నీ కూడా ఆయన సోషల్ మీడియాలో ఆ ఈ విధంగా రాసుకువచ్చారు.  అంతే కాదు ఆయన మరో పెద్ద మాట అన్నారు. మెగా కుటుంబం మీద బురద జల్లడం, వారి మధ్యన విభజన సృష్టించడం వంటివి కూడా ఈ కుట్రలో భాగమట. మరి ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా అంటే ఏమో చూడాలి. రానున్న రోజుల్లో పరిణామాలను బట్టి మాత్రమే అది చెప్పవచ్చు.

ఒక్క విషయం మాత్రం స్పష్టం. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెనక్కి తగ్గడం అంటే జరగదు. ఒక వేళ తగ్గినా కూడా అవతల వారు కోరుకున్నట్లుగా నూటికి నూరు శాతం జరగదు. మరి అలాంటపుడు నింద అయినా నిజమైనా మెగాస్టార్ మాత్రమే మోయాల్సి వస్తుందనే జనసేన అధికార ప్రతినిధి లాంటి వారి ఆవేదనగా పేర్కొంటున్నారు.
Tags:    

Similar News