జగన్ తో భేటి: రాజ్యసభ పుకార్లపై చిరంజీవి స్పందన

Update: 2022-01-14 15:07 GMT
సినిమా టికెట్ల వివాదం పతాక స్థాయికి చేరిన వేళ మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జగన్ లంచ్ కు పిలిచి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అగ్రనటుడు చిరంజీవి  టాలీవుడ్‌కి పెద్దదిక్కుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అభ్యర్థనలను ముందుకు తీసుకొచ్చారు. దీనిపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి ఇరువర్గాలను సంతృప్తిపరిచే పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రత్యేక సమావేశానికి కొన్ని మీడియా సంస్థలు రాజకీయ రంగులు పులమడంతో చిరంజీవి ఈ రాజకీయ పుకార్లపై తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈరోజు ట్విట్టర్ వేదికగా చిరంజీవి.. జగన్ తో భేటి తర్వాత వచ్చిన పుకార్లపై స్పందించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారని.. చిరుకు జగన్ రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. కొన్ని మీడియా సంస్థలు దీన్ని హైలెట్ చేశారు. ఈ పుకార్లపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, థియేట్రికల్ వ్యాపారాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే నేను చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశానని జగన్ క్లారిటీ ఇచ్చారు. నాకు రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు నా భేటీకి పొలిటికల్ టచ్ ఇస్తున్నారని.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏ పదవిలో ఉన్నా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని అందరికీ స్పష్టం చేస్తున్నానను చిరంజీవి తెలిపారు.  దీంతో ఈ పుకార్లకు తెరపడుతుందని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై విరక్తి చెంది వైదొలిగి సినిమాల బాటపట్టారు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ సినీ కళాకారులను ఆదుకుంటూ ఇండస్ట్రీలో ప్రముఖుడిగా కొనసాగుతున్నారు.
Tags:    

Similar News