మొన్న పదవి.. ఇప్పుడు హోదా.. చిర్ల జోరు మామూలుగా లేదుగా?

Update: 2021-10-06 05:44 GMT
కొందరు నేతల సుడి మామూలుగా ఉండదు. సాదాసీదాగా కనిపిస్తూనే...అనూహ్య పదవుల్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఒకటి తర్వాత ఒకటిగా పదవుల్ని పొందటమే కాదు.. హోదాను సొంతం చేసుకోవటం అంత తేలికైనది కాదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న చిర్ల జగ్గిరెడ్డి మాత్రం పదవుల మీద పదవుల్ని సొంతం చేసుకుంటున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మూడు వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ విజయాన్ని సొంతం చేసుకోవటం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి.

ఈ మధ్యనే ప్రభుత్వ విప్ గా ఎంపికైన ఆయనకు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు. నిజానికి విప్ గా నియమించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. అప్పటికే విప్ లుగా పలువురు నేతలు ఉన్నప్పటికి జగన్ మరో విప్ ను తీసుకోవాలనుకోవటం జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది.

ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి ఉంటే.. విప్ లుగా కొరుముట్ల శ్రీనివాసులు.. ఉదయభాను.. పార్థసారధి.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. దాడిశెట్టి రాజా.. ముత్యాల నాయుడు ఉన్నారు. వీరికి అదనంగా చిర్ల జగ్గిరెడ్డిని ఎంపిక చేయటం విశేషం. మరో విషయం ఏమంటే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా ఇప్పటికే విప్ గా ఉన్నప్పుడు.. అదే జిల్లాకు చెందిన మరొకరిని విప్ గా ఎంపిక చేయటం పలువురికి అర్థంకానిదిగా మారింది. తాజాగా కేబినెట్ హోదా ఇవ్వటం ద్వారా.. కొత్త సమీకరణాలకు తెర తీసినట్లుగా చెబుతున్నారు.

రానున్న రోజుల్లో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పనిలో ఉన్న సీఎం జగన్.. ఇప్పుడు విప్ లుగా ఉన్న వారిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలు ఉందని చెబుతున్నారు. ఆ రేసులో జగ్గిరెడ్డి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. విప్ గా ఉన్న ఆయనకు కేబినెట్ హోదాను ఇవ్వటం ద్వారా కొత్త మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందా? లేదంటే.. సమీకరణాలు కుదరని పక్షంలో ఆయన చిన్నబుచ్చుకోకుకండా ఉండేందుకు వీలుగా ముందే.. ఆయనకు కేబినెట్ హోదా కట్టబెట్టేశారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.




Tags:    

Similar News