ఏపీలో రాజకీయ అధికారమే లక్ష్యంగా పవన్-చిరు ప్లాన్?.. బయటపెట్టిన నాదెండ్ల

Update: 2021-01-27 11:59 GMT
ప్రజారాజ్యం పార్టీతో చేతులు కాల్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రానంటూ తన మానాన తను సినిమాలు చేసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు.. తమ్ముడు పవన్ స్థాపించిన జనసేనకు కూడా ఇన్నాళ్లు చిరు దూరంగా ఉన్నారు. అయితే చిరంజీవి మద్దతు పవన్ కళ్యాణ్ కు ఉందని.. జనసేనకు మద్దతుగా చిరంజీవి ఉన్నారని జనసేనలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి చర్చనీయాంశమయ్యాయి.పవన్ కళ్యాణ్ సినిమాలతోపాటుగా రాజకీయాల్లో కూడా కొనసాగుతారని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తన మద్దతు ఉంటుందని చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజారాజ్యం తర్వాత రాజకీయ దుకాణం పూర్తిగా బంద్ చేసిన చిరంజీవి.. తను లాస్ట్ గా పనిచేసిన కాంగ్రెస్ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో ఎప్పటికైనా వస్తారని జనసైనికులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా నాదెండ్ల మనోహర్ జనసేనకు  చిరంజీవి మద్దతు ఉందని నొక్కి వక్కానించడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి తమ్ముడు పవన్ వెనుకాల చిరంజీవి ఉన్నాడని తేటతెల్లమైంది.

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యాక హైదరాబాద్ వచ్చి తొలుత చిరంజీవిని కలిసి ఆ తర్వాత పవన్ ను కలివారు. వీరిద్దరితోనూ భేటి అయ్యారు. ఈ క్రమంలోనే ఒకవేళ బీజేపీ-జనసేన కూటమి ఏపీలో 2024లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చిరంజీవి యాక్టివ్ అవుతాడని.. బ్రేక్ కోసం చూస్తున్నాడని అర్థమవుతోంది.

చిరంజీవి కూడా వస్తే ఏపీలో కాపు సామాజికవర్గం బలంగా తయారవుతుంది. తమ్ముడు, అన్న ఒకే పార్టీలో ఉంటే ఇక బీజేపీకి తిరుగులేదు. ఈ క్రమంలోనే నాదెండ్ల సైతం చిరంజీవి జనసేనకు మద్దతుగా ఉన్నారని చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ వస్తే ఖచ్చితంగా ఏపీలోని కాపు సామాజకివర్గ ఓట్లన్నీ బీజేపీ-జనసేన కూటమికి పడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నాదెండ్ల మనోహర్ ఈ లీక్ చేశారా? అన్న అనుమానాలు ఉన్నాయి.

నిజానికి పవన్ సినిమాలు చేయడం వెనుక చిరంజీవి ఉన్నారనే విషయం కూడా తాజాగా బయటపడింది.  పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావడం వెనుక చిరంజీవి ప్రోద్బలం ఉందని నాదెండ్ల మనోహర్ మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పవన్ సినిమాల్లోకి తిరిగి రావాలని, సినిమాలు చేయాలని చిరంజీవి కోరడంతోనే పవన్ సినిమాల్లోకి వచ్చారని నాదెండ్ల  చెప్పుకొచ్చారు.

పవన్ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని చిరంజీవి చెప్పారని  తెలిపారు. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  దీన్ని బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సినిమాలన్నీ పూర్తి చేసి పవన్, చిరంజీవి ఇద్దరూ ఏపీ రాజకీయ తెరపై యాక్టివ్ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ అధికారమే లక్ష్యంగా అన్నాదమ్ములు ఈ ప్లాన్ చేశారన్న ఊహాగానాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News