హౌడీ-మోడీ ఈవెంట్‌ లో తెలుగు పాట‌..ఇంత చీప్‌ గానా?

Update: 2019-09-23 10:00 GMT
`ఉమ్మడి కలలు - దివ్యమైన భవిష్యత్తు’ ట్యాగ్‌ లైన్‌ తో అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ‘హౌడీ మోడీ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు ప్రధాని మోడీకి అపూ ర్వ, అద్భుత స్వాగతం పలికారు. మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఓ విదేశీ నేత పాల్గొన్న సభకు ఇంత పెద్దఎత్తున జనం రావడం అమెరికా చరిత్రలోనే ఇదే తొలిసారి. క‌ట్ చేస్తే.. ఇంత‌టి భారీ కార్య‌క్ర‌మంలో వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు వినూత్న కార్య‌క్ర‌మాల‌కు బాగానే ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ మేనేజ‌ర్లు చురుగ్గానే వ్య‌వ‌హ‌రించారు.

భార‌తీయ సంస్కృతుల‌కు - సంప్ర‌దాయాల‌కు కూడా పెద్ద‌పీట వేశారు. ఈ క్ర‌మంలోనే తెలుగు నేల‌కు సంబంధించి కూడా కొన్ని మ‌ధుర అంశాల‌ను ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శించారు. దీనికి సంబంధించి యువ‌త‌ను ఎంపిక చేశారు. తెలుగు గీతానికి అవ‌కాశం క‌ల్పించారు. మ‌రి ఇంత‌టి మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి అవ‌కాశం ల‌భిస్తే..తెలుగు సొబ‌గులు ఎలా గుబాళించాలి ? ఎలాంటి తెలుగు సంగీత అమెరికా వాసుల‌కు వీనుల విందు చేయాలి ?  బ‌హుశ ఇంత దూర దృష్టి అక్క‌డి వారికిలోపించి ఉంటుంది. అందుకే.. ఈ కార్య‌క్ర‌మంలో వినిపించేందుకు ఎంపిక చేసుకున్న తెలుగు పాట ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు నేల‌తో సంబంధం ఉన్న కొంద‌రు విద్యార్థులు చేసిన స్టేజ్ పెర్ ఫార్మెన్స్ తీవ్ర వివాదాస్ప‌దం గాను - విమ‌ర్శ‌ల‌కూ తావిచ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు ఎంచుకున్న పాట ``ప‌క్కా లోక‌ల్‌.. నేను ప‌క్కాలోక‌ల్‌`` అనే తెలుగు ఐటం సాంగ్‌ ను ఎంచుకున్నారు. నిజానికి ఈ పాట‌లో అనేక బూతు ప‌దాలు ఉన్నాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే, దీనిని ఊహించ‌ని అనేక మంది ఎన్నారైలు.. అంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క వేదిక‌పై ఇంత చీప్ సాంగ్ ప్లే అవుతుంటే.. దీనికి విద్యార్థులు నృత్యాలు చేస్తేంటే నోరు నొక్కుకున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రెండు కీల‌క దేశాల అధినేత‌లు పాల్గొన్న స‌భ‌లో ఇంత చీప్ సాంగ్ ప్లే చేస్తారా? అంటూ దుయ్య‌బ‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తాం.. నిర్వాహ‌కుల టేస్ట్ అలాంటిద‌ని స‌రిపెట్టుకోవ‌డ‌మే!!


Tags:    

Similar News