వికీలీక్స్‌పై అమెరికా సీరియ‌స్‌..

Update: 2017-03-10 11:12 GMT
అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ పైకి కనిపించినంత మంచిదేం కాదని వికీలీక్స్‌ బట్టబయలు చేయడంతో అమెరికా దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. సీఐఏలో లీకులపై అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. దీనిపై సీఐఏ-ఎఫ్‌ బీఐ సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. వికీలీక్స్‌ బయటపెట్టిన ఫైల్స్‌ అసలైనవేనా? ఈ ఫైల్స్‌ వికీలీక్స్‌ చేతికి ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తు మొదలైంది. అయితే ఈ లీకుల వ్యవహారం అంతర్గతంగా జరిగిందా?  లేక బయట నుంచి సైబర్‌ దాడి జరిగిందో కూడా తేల్చనుంది. అమెరికా ఇంటిలిజెన్స్‌ సామర్థ్యాలను దెబ్బతీసేందుకు వికీలీక్స్‌ ఈ పని చేసిందని సీఐఏ ఆరోపించింది.

కాగా,ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజల ఐఫోన్లు - స్మార్ట్‌ ఫోన్లు - కంప్యూటర్లు - స్మార్ట్‌ టీవీలను సీఐఏ హ్యాక్‌ చేసినట్టు వికీలీక్స్ బయటపెట్టింది. సీఐఏ హ్యాకింగ్ బారి నుంచి యాపిల్‌ - శాంసంగ్‌ - గూగుల్‌ - మైక్రోసాఫ్ట్‌ - వాట్సాప్‌ - సిగ్నల్‌ - టెలిగ్రాం - వైబో లాంటి దిగ్గజాలు కూడా తప్పించుకోలేకపోయాయని వెల్ల‌డించింది. ఈ సీక్రెట్ ఆపరేషన్‌కు అమెరికా పెట్టుకున్న పేరు వాల్ట్‌ 7 డంప్‌. దీనికి సంబంధించి వికీలీక్స్ బయటపెట్టిన పత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న స్మార్ట్‌ ఫోన్లలో ఐ ఫోన్లు, ఆండ్రాయిడ్లే ఎక్కువ. కాబట్టి చాలా మంది సీఐఏ హ్యాకింగ్‌ బారిన పడి ఉంటారని వికీలీక్స్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ చరిత్రలో ఇంత భారీ హ్యాకింగ్‌ ఎప్పుడూ జరగలేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా శాంసంగ్‌ - సోనీ - హెచ్ టీసీ తయారు చేసిన ఉత్పత్తులు హ్యాకింగ్‌ బారిన పడి ఉంటాయని వికీలీక్స్ పత్రాలు పేర్కొంటున్నాయి. సీఐఏ సైబర్‌ నిఘా కేంద్రం నుంచి సంపాదించిన 8 వేల 761 పత్రాలను వికీలీక్స్‌ పబ్లిక్ డొమెయిన్‌ లో ఉంచింది. అమెరికా సీక్రెట్ ఆపరేషన్ వాల్ట్‌ 7 సీరీస్‌లో ఇది ఆరంభం మాత్రమేనన్న వికీలీక్స్ ప్రకటించింది. స్మార్ట్‌ ఫోన్లు - టాబ్లెట్లు - ల్యాప్‌ టాప్‌ లు - స్మార్ట్‌ టీవీలు, పీసీల వంటివాటిని కొన్ని వివరాల నమోదుకు సీఐఏ ఉపయోగించుకుంది. వీటితోపాటు రిమోట్‌ కంట్రోల్‌ వాహనాలను కూడా ప్రయోగించింది. ఇలాంటి హ్యాకింగ్ నుంచి కాపాడుకునే వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల అనేక టెక్ కంపెనీలు ఈజీగా హ్యాకింగ్ బారిన పడ్డాయి.

కాగా, వికీలీక్స్‌ పత్రాలు బయటపడటంతో యాపిల్ వెంటనే అప్రమత్తమైంది. సీఐఏ గుర్తించిన అనేక లోపాలను తక్షణం సరిచేసినట్టు  ప్రకటించింది. సీఐఏ పసిగట్టిన ఇతర లోపాలను కూడా సరిదిద్దడానికి యాపిల్‌ బృందం రంగంలో దిగింది. వినియోగదారుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని.. వారి డివైజ్‌లలో వివరాలకు ఎలాంటి నష్టం జరగదని యాపిల్ భరోసా ఇచ్చింది. ఇటు మైక్రోసాఫ్ట్‌ - గూగుల్‌ - శాంసంగ్‌ - వాట్సాప్‌ కూడా సీఐఏ హ్యాకింగ్ అంశంపై దృష్టి పెట్టాయి. సీఐఏ ఎలాంటి యాప్‌ ను హ్యాక్ చేయలేదని టెలిగ్రాం స్పష్టం చేసింది. సెల్‌ ఫోన్లు - వాటి ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీలు.. యాంటీ హ్యాకింగ్ జాగ్రత్తలు తీసుకుంటే మేలని సూచించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News