ఆ ఎంపీ న్యూడ్ వీడియోపై టీడీపీ నేత‌లపై సీఐడీ కేసులు!

Update: 2022-09-07 04:48 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో కాల్ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. అధికార వైఎస్సార్సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నాయి. అది ఒరిజిన‌ల్ వీడియో అని టీడీపీ అమెరికాలోని ఎక్లిప్స్ సంస్థ‌తో ధ్రువీక‌ర‌ణ చేయించింది. అయితే తాము ఆ వీడియో ఒరిజిన‌ల్ అని చెప్ప‌లేద‌ని ఎక్లిప్స్ తెలిపిందంటూ ఏపీ సీఐడీ విభాగం చీఫ్ సునీల్ కుమార్ వెల్ల‌డించారు. మ‌రోవైపు అనంత‌పురం ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప కూడా అది ఒరిజిన‌ల్ వీడియో కాద‌ని తెలిపారు. అయితే అది ఒరిజిన‌ల్ వీడియో అని.. ఏ సంస్థ‌కు ప‌రీక్ష‌కు పంప‌కుండా అది ఒరిజిన‌ల్ వీడియో కాదని ప్ర‌భుత్వం ఎలా చెబుతుందంటూ టీడీపీ విమ‌ర్శ‌లు చేసింది.

మ‌రోవైపు గోరంట్ల మాధ‌వ్ త‌న వీడియోను ప్ర‌సారం చేశాయ‌ని కులం పేరు పెట్టి చంద్ర‌బాబుతోపాటు కొన్ని మీడియా సంస్థ‌ల అధినేతల‌ను బూతులు తిట్టారు. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం గోరంట్ల మాధ‌వ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌మ్మ సంఘాలు మాధ‌వ్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశాయి.

మ‌రోవైపు ఏపీలోని డిగ్నిటీ ఫ‌ర్ ఉమెన్ జేఏసీ నేత‌లు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి గోరంట్ల మాధ‌వ్ పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. మ‌హిళ‌ల గౌర‌వాన్ని పోగొట్టిన ఎంపీ మాధ‌వ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఈ వ్య‌వ‌హారంపై స్పందించింది. ఆయ‌న‌పై తగిన‌ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కి సూచించింది.  

ఈ ప‌రిణామాల మ‌ధ్య హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ పోలీసులు టీడీపీ నేత‌ల‌పై కేసు నమోదు చేశారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్‌ వీడియోని సృష్టించారని సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్‌ డీజీకి మాధవ్ లేఖ రాశారు.

మార్ఫింగ్ వీడియోను టీడీపీకి చెందిన‌ ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. దీనికి మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు చింతకాయల విజయ్‌, నారా లోకేష్ అధిప‌తులుగా ఉన్నారని తెలిపారు.

దీంతో ప్రతిపక్ష టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్‌ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్‌ మీడియా విభాగంపై కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News