గౌతు శిరీషను ఏడు గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు.. కారణమిదే!

Update: 2022-06-07 05:10 GMT
గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్సార్జి. అంతేనా ఐదుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూతురు. ఇంకా ముందుకు వెళ్తే ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు గౌతు లచ్చన్న మనుమరాలు. గౌడ సామాజికవర్గానికి చెందిన గౌతు శిరీష కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను అన్నింటికి అతీతమనుకుంటున్నారని వైఎస్సార్సీపీ వర్గాల నుంచి గట్టిగానే ఆమెపై విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేసిన కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్చార్జి గౌతు శిరీషను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నట్టుగా కొందరితో ఫేక్‌ పోస్టులను సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారని ఆమెపై అభియోగాలున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక చిహ్నాలను దుర్వినియోగం చేశారని సీఐడీ శిరీషపై కేసు నమోదు చేసింది. ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తున్నట్టు ఫేక్‌ ప్రకటనలను సృష్టించి గౌతు శిరీష తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్‌ చేశారు.

దీంతో ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేసిన 12 సోషల్‌ మీడియా ఐడీలను గుర్తించి సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే నలుగురిని విచారించారు. కాగా ఈ కేసులో గౌతు శిరీషకు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఆమె మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సీఐడీ అధికారుల ఎదుట జూన్ 6న విచారణకు హాజరయ్యారు. తప్పుడు ప్రకటనలతో కేంద్ర చట్టాలను ఉల్లంఘిస్తూ దుష్ప్రచారం చేయడంపై ఆమెను అధికారులు విచారించారు. ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్నారు. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పారు.

అయితే గౌతు శిరీష మాత్రం తనను విచారణకు పిలవడమేంటి? పైగా గంటల తరబడి విచారణకు దిగడమేంటని సీఐడీ అధికారులపై వాగ్వివాదానికి దిగారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేనేమైనా ఉగ్రవాదినా.. నన్నెందుకు విచారణకు పిలిచారంటూ సీఐడీ అధికారులపై చిందులు తొక్కారని సమాచారం.

మరోవైపు శిరీష మాత్రం సీఐడీ అధికారులు అడిగినదానికల్లా సమాధానం ఇచ్చానని చెబుతున్నారు. ఏడు గంటలపాటు విచారించారని, కనీసం మంచినీళ్లు, ఆహారం కూడా అందించలేదని శిరీష ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని సీఐడీ అధికారులపై మండిపడ్డారు. ఓ కాగితంపై వారికి నోటికొచ్చినట్టు రాసుకుని.. దానిపైన సంతకం చేయాలని తనను ఇబ్బంది పెట్టారని శిరీష ధ్వజమెత్తారు. ఏ కేసులో నోటీసు ఇచ్చారో.. దేనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారో చూపాలని అడిగినా చూపించలేదని దుయ్యబట్టారు. సంతకం పెట్టకపోతే బయటకు పంపబోమని బెదిరించారని శిరీష ఆరోపించారు. తన చుట్టూ 30-40 మంది పోలీసులను పెట్టి ఉగ్రవాదిలాగా తనను చూశారని గౌతు శిరీష బోరుమన్నారు.

కాగా సీఐడీ అధికారులు మాత్రం మొత్తం 12 మంది ప్రభుత్వ పథకాలను నిలిపేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారని చెబుతున్నారు. అసత్య ప్రచారంతో కూడిన ఫేక్ నోట్ ను తయారు చేసి సోషల్ మీడియాలో వీరంతా వైరల్ చేశారని వివరించారు. ఇందులో భాగంగానే శిరీషను కూడా నిందితురాలిగా చేర్చి విచారణకు పిలిచామని చెబుతున్నారు.
Tags:    

Similar News