అనధికార కోర్టులుగా మీడియా ...చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు

Update: 2022-07-23 15:55 GMT

దేశంలో అత్యున్నత న్యాయ స్థానం అధిపతి అయిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ టీవీ డిబేట్ల మీద ఘాటు వ్యాఖ్యలే చేశారు. అవి అనధికార కోర్టులుగా మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీవీ చర్చలు పేరిట సాగుతున్న వ్యవహారాలపైన  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

టీవీ డిబేట్లను కంగారు కోర్టులుగా ఆయన అభివర్ణించారు. అంటే అక్కడ సరైన ఆధారాలు, వాద ప్రతివాదాలు లేని అనధికార కోర్టులు అని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని కేసులలో జడ్జీలు కూడా ఇవ్వలేని తీర్పులను ఈ అనధికార కోర్టులుగా ఉన్న టీవీ డిబేట్లు ఇస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడ జరిగే అపరిపక్వతతో కూడిన చర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియా పెడధోరణుల వల్ల మన ప్రజాస్వామ్యం ఒకటికి రెండు అడుగులు వెనక్కి వెళ్తోందని కూడా ఆయన అనడం విశేషం. బాధ్యత లేమి, దూకుడుతనమే దీనికి కారణం అని అన్నారు. ప్రింట్ మీడియాలో ఎంతో కొంత జవాబుదారీతనం ఉందని అదే ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే జీరో జవాబుదారీతనం కనిపిస్తోందని కూడా చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్ణయాత్మక కేసులలో మీడియా విచారణ అన్నది సరైనది కాదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రజలలో వైరుధ్యాలను ప్రచారం చేయడం మీడియాకు తగదని ఆయన సూచించారు. మీడియా తనకు తానుగా స్వీయ నియంత్రణ విధించుకోవాలని, పదాలు వాడేటప్పుడు చాల బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. ఇపుడున్న నేపధ్యంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానికి మీడియా బాధ్యతగా ఉండాలని కోరారు.

ఇక దేశంలో చూస్తే ఎటువంటి రక్షణ లేకుండా న్యాయమూర్తులు జీవించాల్సి వస్తోందని చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో న్యాయమూర్తుల మీద భౌతిక దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

రాజకీయ నేతలు, పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు రిటైర్ అయిన తరువాత సెక్యూరిటీ ఇస్తున్నారని, అదే జడ్జీలకు మాత్రం ఆ విధమైన రక్షణ లేకుండా పోయిందని చీఫ్ జస్టిస్ పేర్కోనడం విశేషం. మొత్తానికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కామెంట్స్ చూస్తే మీడియా తన పాత్రను పరిధిని పూర్తిగా అర్ధం చేసుకుని నడచుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు.
Tags:    

Similar News