జాతీయ పతాకాన్ని ఎగురవేసి..సంచలన వ్యాఖ్యలు చేసిన సీజేఐ

Update: 2021-08-15 08:49 GMT
పంద్రాగస్టు వేళ.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారి నుంచి చిన్నస్థాయి నేత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుంటారు. అదే విధంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజున ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీడియాతో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఒకవేళ మాట్లాడినా.. సంచలన వ్యాఖ్యలు చేయటం చాలా అరుదు. అందుకు భిన్నంగా సీజేఐ జస్టిస్ రమణ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు పనితీరుపై ఆయన సునిశితంగా విమర్శలు సందించారు. పంద్రాగస్టు కావటంతోనో కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆవేదనతో కూడికున్నవిగా ఉండటం గమనార్హం.

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరును ఆయన మనసును బాధించి ఉండొచ్చు. అందుకునేమో.. ఆయన తన మనసులోని మాటను చెప్పేందుకు వెనుకాడరు. గతానికి భిన్నంగా ఈ మధ్యన అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు రాజీ పడటం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి సంశయించటం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు భిన్నంగా సీజేఐ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాల్సిన విషయాల్ని సూటిగా చెప్పేయటం గమనార్హం. పార్లమెంటులో చట్టాలు చేస్తున్న తీరుపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. చట్టాలపై లోతైన చర్చ జరగకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.

నాణ్యమైన చర్చ జరగకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో తెలీకుండా.. చట్టం ఉద్దేశం కూడా ఏమిటో తెలీకుండా పోతోందన్నారు. చట్టసభల్లో మేధావులు.. న్యాయవాదులు ఎక్కువగా లేకపోవటం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టాల్లో ఉండే లోపాల కారణంగా కోర్టులో కేసులు ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి లోపభూయిష్ఠమైన చట్టాలు ప్రజలకు.. ప్రభుత్వానికి భారంగా మారతాయన్నారు.

పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని చెప్పిన జస్టిస్ రమణ.. నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి ఉండేవారని.. ఆయన ఎంతో విపులంగా బిల్లును విశ్లేషించారన్నారు. కార్మికులు.. వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని.. ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంటులో కరువైందన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు న్యాయ దిగ్గజాలు సభ్యులుగా ఉండేవారని.. దీంతో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదన్న సీజేఐ.. న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి.. చట్టసభలకు రావాలని పిలుపునివ్వటం గమనార్హం. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని హితవు పలికిన జస్టిస్ రమణ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.
Tags:    

Similar News