పులివెందులలో టెన్షన్ టెన్షన్

Update: 2018-03-04 16:10 GMT
   
పులివెందులలో తెదేపా - వైకాపా వర్గీయుల మధ్య ఆదివారం సాయంత్రం ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పులివెందులను ఏ పార్టీ ఎక్కువగా అభివృద్ధి చేసిందో తెలియజేసేందుకు బహిరంగ చర్చకు రావాలని నాలుగురోజుల క్రితం రాష్ట్ర శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో స్థానిక పూల అంగళ్ల కూడలి వద్ద బహిరంగ చర్చ కోసం వైసీపీ వర్గాలు వచ్చాయి. కానీ... చర్చ జరగకముందే రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.
    
రెండు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో ట్రాఫిక్‌ ఎస్సై చిరంజీవి గాయపడ్డారు. దీంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఇరువర్గాల కార్యకర్తలను అదుపుచేశారు. అనంతరం ఎస్పీ బాబూజీ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. గాయపడిన ట్రాఫిక్‌ ఎస్సై చిరంజీవిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
    
కాగా ఘటన జరగగానే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. దాంతో పాటు 144 సెక్షన్‌ కూడా విధించారు. రోడ్డుపై ప్రత్యేక బలగాల కవాతు నిర్వహించారు. ప్రస్తుతం పులివెందుల మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని తటస్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణల నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చర్చలకు రమ్మని పిలిచి తమపై దాడులు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News