రేపిస్టుల్ని చంపేస్తారేమో అని..!

Update: 2019-12-03 16:17 GMT
హైద‌రాబాద్ శివార్ల‌లో వెట‌ర్న‌రీ వైద్యురాలి హ‌త్య ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఈ ఘ‌ట‌న జ‌నాల్ని తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది. ఈ ఉదంతం జ‌రిగి ఐదు రోజులు దాటుతున్నా ప్ర‌జాగ్ర‌హం చ‌ల్లార‌లేదు. ఆ నిందితుల్ని మా చేతికివ్వండి.. వాళ్ల‌కు న‌ర‌కం చూపించి హ‌త‌మారుస్తాం అంటూ జ‌నాలు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌ లో అయితే జ‌నాగ్ర‌హం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశాక జైలుకు త‌ర‌లించే స‌మ‌యంలో షాద్ న‌గ‌ర్ ప్రాంతంలో ఎంత‌టి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొందో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ పైకి జ‌నాలు ఎప్పుడెలా ఎటాక్ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు న‌లుగురు నిందితుల్ని కాపాడ‌టం పోలీసుల‌కు క‌త్తి మీద సాము లాగే ఉంది. ఈ న‌లుగురూ ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డ కూడా వీళ్లు సేఫ్ కాద‌నే అభిప్రాయం పోలీసుల్లో నెల‌కొంది. తాజాగా ఈ జైలు స‌మీపంలో కొంద‌రు దిశ‌కు న్యాయం జ‌ర‌గాల‌న్న ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డం పోలీసుల్లో ఆందోళ‌న రేకెత్తించింది. ఇలాంటి నిర‌స‌న‌లు పెద్ద స్థాయిలో జ‌రిగి జ‌నాలు పోగైతే జైలు మీద దాడి చేసినా చేస్తార‌నే భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఈ ప్రాంతంలో జ‌నాలు గుమికూడ‌కుండా ఆంక్ష‌లు విధించారు. అలాగే భ‌ద్ర‌త కూడా పెంచారు. అద‌న‌పు బ‌ల‌గాల్ని దించి గ‌స్తీ కాయిస్తున్నారు. ఐతే బాధితుల్ని కాపాడ‌లేని పోలీసులు ఇలా నిందితుల్ని మాత్రం భ‌లేగా ర‌క్షిస్తారంటూ జ‌నాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News