గవర్నర్-సీఎం మధ్య పెరిగిపోతున్న ఇగో క్లాష్

Update: 2022-02-27 08:21 GMT
పశ్చిమబెంగాల్లో గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య రోజు రోజుకు ఇగో క్లాష్ పెరిగిపోతోంది. తాజాగా మొదలై పెరిగిపోతున్న వివాదాన్ని కేవలం ఇగోనే కారణమవ్వటం స్పష్టంగా కనిపిస్తోంది. తాజా వివాదానికి కారణం ఏమిటంటే మార్చి 7వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. తెల్లవారుజామున 2 గంటలకు అసెంబ్లీ సమావేశం జరగటం దేశంలో ఎప్పుడూ జరగలేదు.

గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ ఇలా రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కు అందిన ఫైలే కారణం. మార్చి 7వ తేదీన ఉదయం 2 గంటలకు అసెంబ్లీ సెషన్ జరపాలని గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదన అందింది. ఆ ఫైలునే యథాతథంగా గవర్నర్ కార్యాలయం ఆమోదించి నోటిఫికేషన్ కూడా జారీచేసింది. నోటిఫికేషన్ చూడగానే జరిగిన తప్పు ఏమిటో అర్ధమైంది. గవర్నర్ కార్యాలయానికి వెళ్ళిన ఫైలులో మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయనే బదులు తెల్లవారుజామున 2 గంటలకని పొరబాటున పడింది.

ఆ పొరబాటును గవర్నర్ కార్యాలయం గమనించినా కావాలనే తెల్లవారుజామున 2 గంటలకు సమావేశాలు మొదలవుతాయని నోటిఫికేషన్ జారీచేసింది. అయితే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ కార్యాలయాల నుండి జరిగిన తప్పును సరిచేస్తు మరో ఫైలు గవర్నర్ కార్యాలయంకు వెళ్ళింది. అయినా గవర్నర్ మాత్రం తెల్లవారుజామున అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాల్సిందే అని పట్టుబట్టారు. అదే పద్దతిలో మళ్ళీ రెండోసారి నోటిఫికేషన్ జారీచేశారు. దాంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఒళ్ళు మండిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మమతబెనర్జీకి గవర్నర్ జగదీప్ దడ్కర్ కు ఏమాత్రం పడటంలేదు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు గొడవలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఇగో పెరిగిపోయి ప్రతి చిన్న విషయం పెద్ద వివాదమైపోతోంది. మరి తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయం విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News