ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ థియేటర్ మూసివేత క్రెడిట్ జగన్ ఖాతాలోకి!

Update: 2021-12-25 10:30 GMT
ఒక నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సినిమా థియేటర్ల మీద దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవహరించని రీతిలో వ్యవహరిస్తూ.. పెద్ద ఎత్తున థియేటర్లు మూసివేసేలా చేయటంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న ధోరణి షాకింగ్ గా మారింది. ఇప్పటికే యాభైకు పైగా థియేటర్లు గడిచిన రెండు రోజుల్లో మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవాల్టి రోజున రోడ్డు పక్కన టీ బంకు వాడి దగ్గర కప్పు టీ రూ.10 అమ్ముతున్నాడు. అలాంటిది మూడు గంటల సినిమా టికెట్ రూ.5, రూ.10, రూ.15 ఫిక్సు చేస్తే ధియేటర్ యజమాని ఏమైపోవాలి? ఇదొక్కటే కాదు.. జీవో నెంబరు 35 పేరుతో విడుదల చేసిన ఉత్వర్వులు షాకింగ్ గా మారటం తెలిసిందే.

ఈ ధరల్ని చూసినోళ్లంతా బతికి ఉంటే బలుసాకు తినొచ్చు కానీ.. థియేటర్ వ్యాపారాన్ని మాత్రం చేయకూడదని డిసైడ్ అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారి వద్ద ఉన్న వి-ఎపిక్ థియేటర్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ థియేటర్ ప్రత్యేకత ఏమంటే.. ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ గా దీనికి పేరుంది. ఈ థియేటర్ లో సినిమాను చూసి ఎంజాయ్ చేయటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ థియేటర్ లో మూవీ చూడటం కోసం.. చుట్టుపక్కల వారే కాదు.. ఆ మార్గం గుండా వెళ్లే వారు సైతం.. ఆ థియేటర్ లో సినిమాను చూసేలా తమ జర్నీని ప్లాన్ చేసుకుంటారు.

అలాంటి పేరున్న థియేటర్ ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం నడపలేమని పేర్కొంటూ మూసేశారు. దీంతో.. క్రిస్మస్ పండుగ వేళ.. సినిమా చూద్దామని వచ్చిన వారంతా నిరాశతో వెనక్కి తిరిగి వెళుతున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ థియేటర్ గా పేరున్న సినిమాహాలు మూసివేసిన ఘనతను జగన్ సర్కారు దక్కించుకుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఇమేజ్ భారీగా డ్యామేజ్ చేస్తుందంటున్నారు. మరి.. సీఎం జగన్ ఈ విషయాన్ని వాస్తవిక కోణంలో ఎప్పుడు ఆలోచిస్తారో?



Tags:    

Similar News