ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌...బాబు తాజా టార్గెట్‌లో వీరే

Update: 2017-10-15 08:37 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయ‌నున్నారా? ఈ ద‌ఫా సెల‌క్టివ్ ప్లాన్స్‌తో బాబు ముందుకు సాగ‌నున్నారా?  టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందో...వైసీపీ ఎక్కడ బలంగా ఉందో..చూసుకుని మరీ ఆ ప్రాంతంపైనే టీడీపీ ఫోకస్‌ పెట్టిందా? పార్టీని పట్టాలెక్కించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే టీడీపీ మైండ్‌ గేమ్‌కు తెరతీసిందా? అంటే అవుననే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌తంతో పోలిస్తే ఇటీవ‌లి కాలంలో రాయలసీమలో పార్టీకి మ‌రింత సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపించిన నేప‌థ్యంలో సీమ‌లోని నేతలే టార్గెట్‌గా తెలుగుదేశం పార్టీ ముందుకు కదులుతోందని స‌మాచారం.

అధికార తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో...త‌మ పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని....పెద్ద నాయ‌కులు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని బ‌హిరంగంగా చాటిచెప్ప‌డం ...అంతర్గ‌తంగా..పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న‌చోట బలోపేతం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తాజా అజెండా అని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను సైకిల్ ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.  ఆపరేషన్‌ రాయలసీమ బాధ్యతలను మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డిలతో పాటు ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేశ్‌లకు పార్టీ అధినాయకత్వం అప్పజెప్పినట్టు సమాచారం. ఇప్ప‌టికే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు బుట్టా రేణుకతో రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ సీఎం రమేశ్‌, గుర్నాథ్‌రెడ్డితో అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

దీంతోపాటుగా మ‌రికొంద‌రిని సైతం సైకిల్ ఎక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే మాజీ మంత్రి శైలజానాథ్‌, కర్నూలు జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. క‌ర్నూల‌కు చెందిన మాజీ సీఎం కోట్ల కుటుంబ సభ్యులతో కూడా టీడీపీ సీనియర్‌ నేతలు చర్చలు జరుపుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికలకు సంబంధించి ఇప్పుడే బయటపెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం సుముఖంగా లేదనేది సమాచారం. జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టాక వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆర్పీఎస్‌కు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది.
Tags:    

Similar News