టికెట్ కోసం ఆ సీఎం రూ.6 కోట్లు అడిగార‌ట‌!

Update: 2019-05-11 11:24 GMT
ఢిల్లీ రాష్ట్రంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి.. విప‌క్ష బీజేపీ మ‌ధ్య ఎన్నిక‌ల వార్ ఏ రేంజ్లో సాగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇప్ప‌టికే మాట‌ల యుద్ధంతో రెండు పార్టీల మ‌ధ్య ఉద్రిక్త‌త న‌డుస్తోంది. ఇదిలా ఉంటే.. స‌రిగ్గా పోలింగ్ కు రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థి కుమారుడు మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అది కూడా ఢిల్లీ ముఖ్య‌మంత్రి క‌మ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద కావ‌టం విశేషం.

త‌న తండ్రికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.6కోట్లు డిమాండ్ చేశార‌ని.. ఆ మొత్తం ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. వెస్ట్ ఢిల్లీ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌ఫున ఉద‌య్ జ‌క్క‌ర్ పోటీలో ఉన్నారు. మూడు నెల‌ల క్రితం ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలాఉంటే.. తాజాగా ఉద‌య్ జ‌క్క‌ర్ కుమారుడు మీడియాతో మాట్లాడారు.

టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.6కోట్లు డిమాండ్ చేశార‌న్నారు. డ‌బ్బు చెల్లించిన త‌ర్వాతే టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ త‌న వ‌ద్ద ఉన్న‌ట్లు చెప్పారు. పూర్తి వివ‌రాల్ని తాను వెల్ల‌డిస్తాన‌న్నారు. తాజా ఆరోప‌ణ‌లు ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి టికెట్ కొనుకున్న అభ్య‌ర్థి.. పోలింగ్ కు ఒక్క‌రోజు ముందు కోట్లు పెట్టి టికెట్ కొన్నాన‌ని బ‌య‌ట‌ప‌డ‌తారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఇదంతా ఆయ‌న ఎందుకు చేస్తున్న‌ట్లు?  తాజా మాట‌ల‌తో త‌న తండ్రి గెలుపు అవ‌కాశాల మీద ప్ర‌భావం చూప‌ట‌మే కాదు.. పార్టీ విజ‌య‌వ‌కాశాల మీద ప్ర‌భావం చూప‌టం ఖాయం. అదేనా ఆయ‌న‌కు కావాల్సింది? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా పోలింగ్ కు రోజు ముందు వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ఓట‌ర్ల మీద పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News