వైఎస్సార్‌కు సీఎం జగన్‌, కుటుంబ సభ్యుల ఘన నివాళి

Update: 2020-07-08 06:00 GMT
దివంగత నేత ,  మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన కొడుకు, ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ‌రెడ్డితో  పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిన్న సాయంత్ర‌మే ఇడుపుల‌పాయ‌కు వెళ్లారు.

వైఎస్సార్ ‌కు నివాళి అర్పించిన తరువాత  "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైఎస్సార్‌". వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. వీటితోపాటు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.  ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  నిర్వహిస్తుంది.
Tags:    

Similar News