ఏది నిజం? జగన్ ను మోడీ లైట్ తీసుకున్నారా? మరి మొదటి వరుస ప్రాధాన్యత ఏంటి?

Update: 2023-05-29 10:50 GMT
ఏది నిజం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు ఎలా ఉంది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఓవైపు తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఎలా రియాక్టు అవుతున్నారు? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళలోనే నీతీ ఆయోగ్ సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్.. మూడు రోజులుగా అక్కడే ఉన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యే అవకాశం లేదన్న అంచనాకు తగ్గట్లే.. ఆయన ప్రధానిని కలవలేదు. అదే సమయంలో అతి కష్టమ్మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆదివారం రాత్రి పది గంటల వేళలో (సరిగ్గా చెప్పాలంటే 10.10 గంటల వేళలో) కలిశారు. వారిద్దరి భేటీ సుమారు 20 నిమిషాలకు పైనే సాగింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న దానికి సంబంధించి అధికారిక నోట మాత్రం.. విభజన అంశాలు.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు.. ఏపీకి కేంద్రం అందించాల్సిన సాయం మీద వినతి లాంటి అంశాలు ఉన్నాయి.

ఇక.. కొత్త పార్లమెంటును ప్రారంభించిన సందర్భంగా జగన్ కు దక్కిన మర్యాద ఎంత? ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ప్రధాని మోడీ ఎలా రియాక్టు అయ్యారు? లాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. జరిగిన అంశాల్ని జరిగినట్లుగా రిపోర్టు చేయాల్సి వస్తే..  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తొలి వరుసలో చోటు దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెంతన సీఎం జగన్ కూర్చున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా పక్కన కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేసినా.. ఎవరో ఒకరు వచ్చి ఆయన్ను కలుస్తూ.. పలుకరిస్తూ ఉండటంతో.. ఆయన వద్దకు వెళ్లిన జగన్ తిరిగి తన సీట్లో కూర్చున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూరతిగా ఉంటూ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ పీకే మిశ్ర  మాత్రం.. సీఎం జగన్ కు కాస్తంత దూరంలో కూర్చున్నారు. అయినప్పటికీ ఆయన లేచి.. సీఎం జగన్ వద్దకు వచ్చి కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  కూర్చున్న చోటుకు వెళ్లిన సీఎం జగన్ వారికి నమస్కరించి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..  నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన అతిధులను పలుకరించేందుకు ప్రధాని మోడీ ఒక్కొక్కరిగా పలుకరించుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా అందరిని పలుకరించే వేళలో.. మోడీకి జగన్ రెండు..మూడు సార్లు అభివాదం చేయటం.. అందుకు ప్రధాని మోడీ స్పందించకపోవటం కనిపించింది.

అయితే.. హడావుడిలో మిస్ అయ్యారా? లేదంటే.. ఇంకేదైనా కారణమన్నది పక్కన పెడితే.. మోడీ తిరిగి అభివాదం చేయని వైనం కనిపించింది. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి 10 గంటల వేళలో ప్రధాని మోడీ నీడ.. అమిత్ షా తో భేటీ కావటం చూస్తే.. జగన్ ను మోడీ పట్టించుకోవటం లేదన్న వాదనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.

Similar News