టాలీవుడ్ కి సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్?

Update: 2022-02-09 16:22 GMT
కొన్ని నెల‌లుగా ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో జీవో నెంబ‌ర్ 35 అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో నిర్మాత‌లు..డిస్ర్టిబ్యూట‌ర్లు..బ‌య్య‌ర్లు...థియేట‌ర్ యాజ‌మాన్యాలు గ‌గ్గొలు పెట్ట‌డం.. ఇండ‌స్ర్టీ పెద్ద‌ల‌తో ప్ర‌భుత్వం భేటీలు విఫ‌లం కావ‌డం...మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వ‌డం ఇలా చాలా పెద్ద హైడ్రామానే న‌డిచింది.

దీనిపై ప్ర‌భుత్వం క‌మిటీ వేసి విచార‌ణ‌కు ఆదేశాలు  ఇచ్చిన సంగ‌తి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడా క‌మిటీ రిపోర్ట్ సిద్దం చేసింది. ఇండ‌స్ర్టీకి సానుకూలంగానే క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులు బాటు రిపోర్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌ల్టీప్లెక్స్ టిక్కెట్ రేట్ల‌లో పెద్ద‌గా తేడాలు లేవుగానీ..మున్సీపాలిటీలు..గ్రామ పంచాయ‌తీల‌లో ఉన్న థియేట‌ర్ల‌లో టిక్కెట్ ధ‌ర‌లు మాత్రం పెర‌గాలి అన్న‌దే పాయింట్ గా క‌నిపిస్తోంది. రిపోర్ట్ ప్ర‌కారం ప్రాంతం ఏదైనా స‌రే నాన్ ఏసీ థియేట‌ర్లు ఎక్క‌డున్నా క‌నీస టి్కెట్ ధ‌ర 30 రూపాయ‌లు ఉండాలి. కానీ జీవో నెంబ‌ర్ 35 ప్ర‌కారం 5 రూపాయ‌లు.

అంటే రిపోర్ట్ ప్ర‌కారం 25 రూపాయ‌లు పెరుగుతుంది. నాన్ ఏసీలో గ‌రిష్టంగా ఉన్న 15 రూపాయ‌ల టిక్కెట్ 70 రూపాయ‌ల‌కు పెంచాలి. ఏసీ హాళ్ల విష‌యానికి వ‌స్తే జీవో ప్ర‌కారం  గ్రామ పంచాయ‌తీల్లో క‌నిష్టంగా  10..గ‌రిష్టంగా 20 రూపాయ‌లు ఉంది.

ఇక న‌గ‌ర పంచాయ‌తీల్లో  క‌నిష్టంగా 15..గ‌రిష్టంగా 35 రూపాయ‌లు..మున్సీపాలిటీలో త‌క్కువ‌గా 40 రూపాయ‌లు.. ప్రీమియం టిక్కెట్ ధ‌ర 100 ఉంది. ఈ ధ‌ర‌ల్ని స‌వ‌రించాలి. క‌మిటీ లెక్క ప్ర‌కారం క‌నిష్టంగా 40 రూపాయ‌లు.. గ‌రిష్టంగా 150 రూపాయ‌లు పెంచుకునేలా అనుమ‌తి ఇవ్వాలి. అంటే ఏసీ థియేట‌ర్లో అత్య‌ధికం అనుకున్న‌ది క‌నిష్ట ధ‌ర‌గా మార‌బోతుంది.

ఇక మ‌ల్టీ ప్లెక్స్ లో టాప్ టూ బాట‌మ్ ఒకే ధ‌ర కాకుండా ప్రీమియం.. డీల‌క్స్..ఎకాన‌మీ క్లాసులు ఉండాలని  కమిటీ సూచించింది. మ‌ల్టీప్లెక్స్ లో జీవో ప్ర‌కారం 250 రూపాయ‌లు అమ‌లులో  ఉంది. జీవో నెంబ‌ర్ 35 ప్ర‌కారం ప్రాంతాల్ని బ‌ట్టి థియేట‌ర్ల‌ని విభజించారు. కానీ క‌మిటీ ఈ బేధాలు వ‌ద్ద‌ని సూచించింది. మొత్తానికి ప్ర‌భుత్వం    ఇచ్చిన  రిపోర్ట్ ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగానే ఉంద‌ని తెలుస్తోంది. గురువారం సీఎం జ‌గ‌న్ తో సినీ పెద్ద‌లు భేటీ ఉంది. ఆ భేటి అనంత‌రం క‌మిటీ కొత్త జీవోని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News