బాబు కోట నుంచి జగన్ వారికి ఇచ్చిన వరం

Update: 2022-09-23 09:52 GMT
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ కధ గత దశాబ్దకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ ఎంపీగా బయటకు వచ్చిన నాటి నుంచి బాబుతో డైరెక్ట్ ఫైట్ కి రెడీ అయిపోయారు.

బాబు సైతం జగన్ని జూనియర్ గా చూడకుండా ఢీ కొడుతూనే వచ్చారు. ఇపుడు జగన్ సీఎం అయి టీడీపీనే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇపుడు ఆయన ఏకంగా తన రాజకీయ జీవిత కాలంలో వెళ్లని కుప్పానికి వెళ్ళారు.

 అది బాబుకు కంచుకోట. చంద్రబాబు 1989 నుంచి ఇప్పటికి ఏడుసార్లు గెలిచిన కంచుకోట. టీడీపీని అక్కడ ఓడిస్తాను బాబుని మాజీ ఎమ్మెల్యే చేస్తాను అని శపధం పట్టి మరీ కుప్పానికి వెళ్ళిన జగన్ అక్కడ ఊరకే ఉపన్యాసం చేయలేదు. కుప్పం నుంచి బిగ్ సౌండ్ చేశారు. అంతే కాకుండా ఏపీలోని వృద్ధులందరికీ శుభవార్త చెప్పారు.

 ఇప్పటిదాకా ఇస్తున్న సామాజిక పించన్లకు ఏకంగా 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెంచుతున్నట్లుగా జగన్ భారీ ప్రకటన చేశారు. ఈ పెంపు అన్నది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లుగా జగన్ చెప్పడం విశేషం. ఇప్పటికే ఈ ఏడాది 2,500కి పెన్షన్ పెంచిన జగన్ మరో 250 రూపాయలను ఈ విధంగా పెంపు చేశారన్న మాట.

ఇక పాదయాత్ర వేళ జగన్ పెన్షన్ ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. దాని ప్రకారం 2024 జనవరి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు అందుతుంది అన్న మాట.

తాను చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ హామీని నెరవేరుస్తాను అని జగన్ కుప్పం నుంచే హామీ ఇవ్వడం విశేషం. మొత్తానికి కుప్పానికి జగన్ వచ్చి వెళ్లారు అన్నది కాకుండా అక్కడ నుంచి భారీ వరాన్నే జగన్ ప్రకటించి బాబు కోటలో పాగా వేయాలని చూశారని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News