సీఎం జగన్ సాహసం.. ఏపీలో 'తెలంగాణ' మంత్రి?

Update: 2022-04-13 03:19 GMT
నిజమే.. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే అత్యున్నత పదవులు చేతిలో ఉండగానే సరిపోదు. దానికి మించిన ధైర్యం.. కొన్నిసార్లు సాహసాల్ని ప్రదర్శించాల్సిందే. విధేయతకు పెద్ద పీట వేస్తూ.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త పద్ధతుల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా మంత్రి పదవుల్ని పొందిన వారిలో కొందరు.. తమ ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి.. ఆయన చేతిని అప్యాయంగా పట్టుకొని ముద్దాడటం చూసినప్పుడు.. కొత్త తరహా రాజకీయాలు షురూ అయినట్లేనని చెప్పక తప్పదు. గతంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  విషయంలో ఆ పార్టీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేయటం తెలిసిందే.

అప్పట్లో అన్నాడీఎంకే నేతల తీరు సంచలనంగా మారితే.. తాజాగా వైసీపీ నేతల భక్తి ప్రపత్తులు సరికొత్త చర్చకు తెర తీశాయి. మంత్రివర్గ కూర్పును చూస్తే.. అధినేతను కళ్ల ముందు కదలాడే దైవ స్వరూపంలా భావించే వారికి పదవుల్ని ఇవ్వటం.. ఆకాశానికి ఎత్తేస్తే వారికి పెద్ద పీట వేయటం లాంటివి కనిపిస్తుంది. అన్నింటికి మించి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక నేతకు మంత్రి పదవిని ఇవ్వటం ద్వారా జగన్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విడుదల రజనీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావటం గమనార్హం.

మీరు నాటి మొక్క సార్ నేను.. అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్నే క్రియేట్ చేశాయి. తెలుగుదేశం పార్టీలో నేతగా ఎదిగే క్రమంలో.. మహానాడులో తనకు ప్రసంగించే అవకాశం లభించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరిని ఆకర్షించాయి.

కాలక్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఆమె తన తొలి ప్రయత్నంలోనే.. తన రాజకీయ గురువు పత్తిపాటి పుల్లారావును మట్టి కరిపించారు. తాజా మంత్రి వర్గంలో అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమెకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్క పల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కుమార్తె విడుదల రజనీ.

ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన వారంతా ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సత్తయ్య ఫ్యామిలీ నలభై ఏళ్ల క్రితం ఊరి నుంచి హైదరాబాద్ కు వలస వెళ్లారు. సఫిల్ గూడలో ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు ఉంటే.. రెండో కూతురే రజనీ. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైన అనంతరం ఆమె అత్తారింటికి షిఫ్టు అయ్యారు. ఈ క్రమంలో చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటం.. ఏపీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఏపీ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసే విషయంలో జగన్ సాహసమే చేశారని చెప్పాలి. అప్పుడప్పుడు ఏపీ -తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటలయుద్ధంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు.. విద్యుత్ ఉత్పత్తి విషయం మీద మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ ఏపీ మీద తెలంగాణ నేతలు పలువురు మండిపడటం తెలిసిందే. అయినప్పటికీ తన ప్రాధాన్యతలో ఏపీకి చెందిన పలువురు నేతలు మంత్రి పదవుల కోసం కొండంత ఆశ పెట్టుకున్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన విడుదల రజనీకి అవకాశం ఇవ్వటం ద్వారా.. సీఎం జగన్ పెద్ద సాహసమే చేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News