యాగం మ‌ధ్య‌లో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌

Update: 2019-01-23 04:29 GMT
కేసీఆర్ ఏం చేసినా వార్తాంశ‌మే. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు అలా ఉంటాయి మ‌రి. అత్యంత కీల‌క‌మైన అంశాల్ని సింఫుల్ గా లైట్ తీసుకునే అల‌వాటు ఉన్న ఆయ‌న‌.. కొన్ని విష‌యాల‌కు ఆయ‌నెంత ప్రాధాన్య‌త ఇస్తారన్న‌ది అస్స‌లు ఊహించ‌లేం. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి గురి పెట్టిన కేసీఆర్‌.. ప్ర‌త్యేక విమానం వేసుకొని ప‌లు రాష్ట్రాల‌కు వెళ్లి.. ప‌లువురు ముఖ్య నేత‌ల్ని క‌లిసి రావ‌టం తెలిసిందే.

తాను షురూ చేసిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌స్తు ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని చెప్పే ఆయ‌న‌.. ఇటీవ‌ల విప‌క్షాలు క‌లిసి కోల్ క‌తాలో నిర్వ‌హించిన భారీ ర్యాలీకి  డుమ్మా కొట్టారు. దీదీ నిర్వ‌హించిన ఈ స‌భ‌కు కేసీఆర్ ఎందుకు వెళ్ల‌లేదు చెప్మా అంటే..అసెంబ్లీ న‌డుస్తుంటే ఎలా వెళ‌తారంటూ కేసీఆర్ కుమార్తె క‌విత చెప్పుకొచ్చారు. ఓ ప‌క్క అసెంబ్లీ జ‌రుగుతుంటే.. మ‌రోప‌క్క ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైన ట్రాక్ రికార్డు ఉన్న కేసీఆర్‌.. కోల్ క‌తాలో అంత భారీ బ‌హిరంగ స‌భ‌కు వెళ్ల‌క‌పోవ‌టానికి ఏదో కార‌ణం ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెళ్ల‌టం వ‌ల్లే.. కేసీఆర్ వెళ్ల‌లేద‌న్న మాట వ‌చ్చినా.. అది నిజం కాద‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంతో తేలిపోయింద‌ని చెప్పాలి.

అసెంబ్లీ స‌మావేశానికి మించి ముఖ్య‌మైన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని సిద్ధిపేట జిల్లా ఎర్ర‌వెల్లిలోని సీఎం వ్య‌వ‌సాయ క్షేత్రంలో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. యాగం జ‌రుగుతున్న రెండో రోజున  కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుమారుడు మ‌యాంక్ పెళ్లి ఢిల్లీలో జ‌రిగింది. త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సిన వేడుక కావ‌టంతో ఆయ‌న రెండో రోజు యాగం ముగిసిన త‌ర్వాత ఎర్ర‌వెల్లి నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చి ఢిల్లీకి వెళ్లారు.

పెళ్లి వేడుక చూసుకొని మంగ‌ళ‌వారం రాత్రే తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఢిల్లీకి వెళితే.. రెండు మూడు రోజులు.. కొన్నిసంద‌ర్భాల్లో వారానికి పైనే ఉండే కేసీఆర్‌.. సుడిగాలి మాదిరి అలా ఢిల్లీ వెళ్లి.. ఇలా తిరిగి వ‌చ్చారు. తాను త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌న్న కార్య‌క్ర‌మం అయితే.. ఎంత ముఖ్య‌మైన ప‌నులు ఉన్నా.. యాగాలు జ‌రుగుతున్నా.. వాటి నుంచి బ్రేక్ తీసుకొని మ‌రీ ఎలా వెళ్లి వ‌స్తార‌న్నది తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.



Full View

Tags:    

Similar News