లేని వారిపై ఈ రంకెలు ఏంది కేసీఆర్‌?

Update: 2018-10-06 07:08 GMT
నిజ‌మే రాజ‌కీయాలు భ్ర‌ష్టుప‌ట్టిపోయాయ్‌. కానీ.. ఎంత భ్ర‌ష్టు ప‌ట్టినా కోట్ల మంది జీవితాల్ని నేరుగా ప్ర‌భావితం చేసే రాజ‌కీయాల్ని త‌క్కువ చేసి చూడ‌లేం. కాద‌నుకొని వ‌దిలేయ‌లేం. మ‌నం ఎంత కాద‌నుకున్నా.. ఏదో రూపంలో రాజ‌కీయం మ‌న జీవితాల్ని ప్ర‌భావితం చేస్తూనే ఉంటుంది. అందుకే.. ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని వారు సైతం రాజ‌కీయంగా చోటు చేసుకునే మార్పుల గురించి ఒకింత క‌న్ను వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

రాజ‌కీయం బాగోలేద‌ని.. రాజ‌కీయ నేత‌ల తీరు బాగోలేద‌ని వ‌దిలేసే క‌న్నా.. మ‌న‌ల్ని పాలించే పాల‌కుల గురించి ప‌ట్టించుకోకుంటే.. భ‌విష్య‌త్ త‌రాలు ఏమాత్రం క్ష‌మించ‌వు. ఈ విష‌యాన్నితాజాగా కేసీఆర్ వ్యాఖ్య‌లు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతాయి. ఎంత దిక్కుమాలిన రాజ‌కీయ‌మైతే మాత్రం.. ఈ లోకంలో లేని వారి గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం ఏ మాత్రం స‌మంజ‌సం అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తానుచెప్పేది స్టోరీ కాద‌ని.. చ‌రిత్ర అని చెప్పే కేసీఆర్‌.. చ‌రిత్ర‌ను చ‌రిత్ర‌లా కాకుండా కేసీఆర్ మ‌సాలా గుప్పించి దారుణ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్‌ బట్టెబాజ్‌ - ధోఖేబాజ్‌... అంటూ ఒక పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారమేనా ఇదంటూ కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తుంది. ఇక్క‌డ కేసీఆర్ మర్చిపోకూడ‌ని విష‌యం ఏమంటే.. ఆయ‌న ఇప్పుడు సీఎం కాదు.. కేవ‌లం ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి మాత్ర‌మే. ఆ మాట‌కు వ‌స్తే ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే లేద‌న్న‌ది ఆయ‌న ఎలా మ‌ర్చిపోతారు.

అంద‌రి మాదిరే కేసీఆర్ కూడా ఒక రాజ‌కీయ నాయ‌కుడు.. ఒక పార్టీ అధినేత మాత్ర‌మే. త‌న‌కు తాను నిద్ర లేచింది మొద‌లు.. ఛీ.. ఛీ.. మీ బ‌తుకులు చెడ ద‌గ్గ‌ర నుంచి నోటికి వ‌చ్చినట్లుగా తిట్టి పోసే కేసీఆర్‌.. త‌న‌ను మాత్రం ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌ద‌న్న మాట‌ను చెప్ప‌టం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అన్నది ప్ర‌శ్న‌.

తాజాగా వ‌న‌ప‌ర్తిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్‌.. దివంగ‌త నేత‌ల గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌టం ఏ మాత్రం స‌బ‌బు కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ‌కు దారుణ‌మైన మోసం చేసిన‌ట్లుగా దేశ ప్ర‌ధ‌మ ప్ర‌ధాని నెహ్రును.. తెలంగాణ‌లో యువ‌కుల మ‌ర‌ణాల‌కు ఇందిరా గాంధీ కార‌ణ‌మ‌ని మండిప‌డుతున్న ఆయ‌న‌.. దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఉద్దేశించి మ‌హా దుర్మార్గుడంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌బ‌బు కావ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఈ లోకంలో లేని.. తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన దివంగ‌త నేత‌ల గురించి నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం స‌రికాదంటున్నారు. త‌మ మీద వేసిన ఆరోప‌ణ‌ల్ని తిరిగి స‌మాధానం ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉండే దివంగ‌త నేత‌ల గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేయ‌టం స‌రైనదేనా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. ఈ తీరును ఇప్పుడు ఖండించ‌కుంటే.. రానున్న రోజుల్లో కేసీఆర్ నోటికి అడ్డూ ఆపూ ఉండ‌దు. విలువ‌ల కోసం ప‌రిత‌పించే వారు మ‌న‌కెందుకులే అన్న‌ట్లు వ‌దిలేయ‌కుండా కేసీఆర్ తీరు స‌రిగా లేద‌న్న మాట‌ను ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పే టైం వ‌చ్చింది. ఇప్పుడు వ‌దిలేస్తే.. ఈ ద‌రిద్ర‌పు సంస్కృతి మ‌రింత ముద‌ర‌టం ఖాయం.
Tags:    

Similar News